మేధోమధనం
తలను
తడితే
తట్టెడు తలపులు
తచ్ఛాడుతాయి
మనసును
మీటితే
మధురభావాలు
ముసురుకుంటాయి
మదిని
మధిస్తే
మంచివిషయాలు
మెండుగామొలకెత్తుతాయి
హృదిని
ఉబికిస్తే
ఉత్సాహము
ఉప్పొంగుతుంది
గుండెను
గిల్లితే
గాఢముగా
గుబులురేపుతుంది
చిత్తాన్ని
చిదిమితే
చెలరేగి
చిందులేయిస్తుంది
అంతరంగాన్ని
అదిరిస్తే
ఆలోచనలను
ఆవిర్భవిస్తుంది
ఉల్లాన్ని
ఉసిగొలిపితే
ఉవ్విళ్ళూరి
ఊహలలోకంలోకి తీసుకెళుతుంది
మతిని
మందలిస్తే
మూతిబిగించి
మారాముచేస్తుంది
మనమును
మాడిస్తే
మెదలకకదలక
మొద్దుబారిపోతుంది
మనస్సుకు
ముక్కుతాడువేస్తే
ముందుకెళ్ళక
మట్టికఱిపిస్తుంది
మేధోసేద్యము
చేస్తే
మేలయినపంటలు
పండిస్తుంది
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments
Post a Comment