ఓహో మేఘమాలా!


ఆకాశము ఆక్రమిస్తావా

అక్కడనీలివర్ణము అంటుతావా

ఎండలు తగ్గిస్తావా

చల్లదనము కలిగిస్తావా


ఉరుములు వినిపిస్తావా

పెళపెళా ప్రతిధ్వనించేలా

మెరుపులు చూపిస్తావా

మిలమిలా మెరిసిపోయేలా


రంగులు బదలాయిస్తావా

రూపాలు మార్చుకుంటావా

ఆకాశంలో తేలుతావా

అంతరంగంలో తిష్టవేస్తావా


రవిని కప్పుతావా

శశిని క్రమ్ముతావా

భువికి దిగుతావా

భూమిని త్రాకుతావా


తనువులు తడుపుతావా

తాపము తీరుస్తావా

చిందులు త్రొక్కిస్తావా

గబగబా ఉత్సాహంగా


చినుకులు రాలుస్తావా

చిటపటా చిత్రవిచిత్రంగా

వరదలు పారిస్తావా

గలగలా గంగలా


జలాశయాలు నింపుతావా

బిరబిరా జాగుచేయకుండా

పొలాలు తడుపుతావా

పుడమంతా పదునయ్యేలా


చెట్లను చిగురింపజేస్తావా

ధాత్రిని సస్యశ్యామలంచేస్తావా

పంటలు పండిస్తావా

ఇల్లంతా నిండేలా


గొంతులు తడుపుతావా

దాహార్తి తీరేదాకా

కడుపులు నింపుతావా

ఆకలి సమసేదాకా


పువ్వులను పూయిస్తావా

పండ్లను ఫలింపజేస్తావా

మనసులను ముట్టుతావా

మనుజులను మురిపిస్తావా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog