నా ఒయ్యారిని (గజల్ తీస్రగతి)


తేనెలాంటి పలుకులతో స్వాగతించ చూస్తున్నా

తీపితీపి వంటలతో పులకరించ చూస్తున్నా


మరుమల్లెల వాసనతో మభ్యపెట్ట తలపోస్తూ

మత్తుచల్లి మైకంలో ముచ్చటించ చూస్తున్నా


తేటతేట నవ్వులతో అలరించగ కోర్కొంటూ

వదనంబును విరులలాగ వికాసించ చూస్తున్నా


ప్రద్యుమ్నుని బాణములను వదలాలని కాంక్షిస్తూ

గురినిచూచి గుండెలోకి దూరుపించ చూస్తున్నా


పిచ్చిదాన్ని చేయాలని ప్రణాళికను పాటిస్తూ

ప్రేమలోకి దించాలని పురాయించ చూస్తున్నా


వలనువిసిరి చేపలాగ బంధించగ శ్రమపడుతూ

స్వంతంబును చేసుకొనగ సాహసించ చూస్తున్నా


చెంతచేరి చేయిపట్టి చనువుగుండ తలంచుతూ

తనివితీర తృప్తిపరచి సంతసించ చూస్తున్నా


మెడనువంచి తాళికట్టి సతిగపొంద ఆశిస్తూ

ఇంటిలోకి ఇల్లాలుగ స్వీకరించ చూస్తున్నా


వంటినిండ నగలుతొడిగి వగలాడిగ వీక్షిస్తూ

అర్ధాంగిగ స్థానమిచ్చి ఆదరించ చూస్తున్నా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం  



Comments

Popular posts from this blog