కవిగారిలోకాలు


తెలుగులోకం

పిలుస్తుంది

తేనెచుక్కలు

చల్లమంటుంది


ఊహాలోకం

ఊరిస్తుంది

భావాలను

బయటపెట్టమంటుంది


ప్రేమలోకం

ప్రలోభపెడుతుంది

ప్రణయగీతాలు

పుటలకెక్కించమంటుంది


మహిళాలోకం

అండనివ్వమంటుంది

వివక్షతలకు వ్యతిరేకంగా

కలాన్ని కదిలించమంటుంది


బాలలలోకం

బ్రతిమలాడుతుంది

చిత్రవిచిత్రాలను

చూపమంటుంది


కలలలోకం

కవ్విస్తుంది

కమ్మనికైతలు

కూర్చమంటుంది


వెన్నెలలోకం

రమ్మంటుంది

విరహగీతాలు

విరచించమంటుంది


పాఠకలోకం

ప్రోత్సహిస్తుంది

మదులను

దోచుకోమంటుంది


కవనలోకం

ఆహ్వానిస్తుంది

కలకాలము

నిలిచిపొమ్మంటుంది


సాహిత్యలోకం

స్వాగతిస్తుంది

సత్కవితలను

సృష్టించమంటుంది


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్,భాగ్యనగరం  


Comments

Popular posts from this blog