సమయోచితకవితలు 


మెలుకువ వస్తుంది

కల అంతమవుతుంది

స్వప్నము గురుతుకొస్తుంది

కవిత కూరుతుంది 


పువ్వులు వాడిపోతాయి

పరిమళాలు చల్లకుంటాయి

మనసు నొచ్చుకుంటది 

కైత పుట్టకొస్తది 


నవ్వులు ఆగిపోతాయి

మోములు ముడుచుకుంటాయి

ఙ్ఞాపకాలు తడతాయి

అనుభవాలు పుటలకెక్కుతాయి 


మామిడిచెట్లు కాయకుంటాయి

కోకిలలు కూయకుంటాయి

గానాలు ఆగిపోతాయి

కవనాలు కాగితాలపైకూర్చుంటాయి 


మల్లెచెట్లు మొగ్గలెయ్యవు

మదులు ముచ్చటపడవు

మహిళలు వాపోతారు

కవిత కూడుతుంది 


వానలు మొదలవుతాయి

వరదలు పారుతాయి

జలాశయాలు నిండుతాయి

కయిత తయారవుతుంది 


వసంతం నిష్క్రమిస్తుంది

గ్రీష్మము ముగిసిపోతుంది

వర్షాలు మొదలవుతాయి

కవితాజల్లులు కురుస్తాయి 


దృశ్యాలు మారుతాయి

ప్రకృతి కొత్తరూపందాల్చుతుంది

అందాలు విభిన్నమవుతాయి

ఆనందరాతలు ఆవిర్భవిస్తాయి 


కాలచక్రం తిరుగుతుంది

సమయము గడుస్తుంది

జీవితము ముందుకుసాగుతుంది

సమయోచితవ్రాత సృష్టించబడుతుంది 


కవులు నిత్యమూస్పందిస్తారు

కలాలు కదిలిస్తారు

కాగితాలు నింపుతారు

కవితలను కదంత్రొక్కిస్తారు  


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 



Comments

Popular posts from this blog