విరుల విన్యాసాలు


కుసుమాలు విచ్చుకున్నాయి

తేనెటీగలకు సందడే సందడి

పరిమళాలు వీస్తున్నాయి

ఆఘ్రానితులకు పండుగే పండుగ


పుష్పాలు పొంకాలుచూపుతున్నాయి

పరికించేవారిది అదృష్టమే అదృష్టం

ఆస్వాదించేవారిని అబ్బురపరుస్తున్నాయి

అంతరంగాలకి ఆనందమే ఆనందం


సుమాలు రంగులువిసురుతున్నాయి

కళ్ళకిస్తున్నాయి కుతూహలం కమ్మదనం 

కాంచేవారిని కట్టేస్తున్నాయి

చేకూరుస్తున్నాయి చోద్యం సంభ్రమం


పీలుపులు పిలుస్తున్నాయి

బాటసారులకు సంతసమే సంతసం

చెంతనే నిలువమంటున్నాయి

చేస్తున్నాయి సరదాలు సంబరాలు


అలరులు ఊగుతున్నాయి

ఆగకుండా తూలుతూ త్రుళ్ళుతూ

దోస్తున్నాయి చిత్తాలు

ఊపుతున్నాయి ఉయ్యలజంపాలలు


ప్రసూనాలు తెంచుకోమంటున్నాయి

తురమమంటున్నాయి తరుణుల కొప్పుల్లో

దండలు అల్లమంటున్నాయి

వెయ్యమంటున్నాయి దేవతల మెడల్లో


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం  



Comments

Popular posts from this blog