నా స్వేచ్ఛాజీవితం


శరీరానికి

లోపాలులేనివాడిని

అవయవాలను

పూర్తిగా ఉపయోగించుకుంటా


చేతికి

బేడీలులేనివాడిని

చేయాలనుకున్నది చేస్తా

సక్రమంగా నడచుకుంటా 


కళ్ళకి

గంతలులేనివాడిని

నిజాలను చూస్తా

నిర్భయంగా మసలుకుంటా


నోటికి

తాళాలులేనివాడిని

చెప్పాలనుకున్నది చెబుతా

తేనెచుక్కలు చల్లుతా


చెవులను

మూసుకునేవాడినికాను

పిలిస్తే పలుకుతా

కోరితే సహకరిస్తా


కాళ్ళకు

బంధాలులేనివాడిని

కావలసినచోటుకు వెళ్తా

కార్యాలు కరాఖండీగాచేస్తా


ఆలోచనలపై

అవరోధాలుపెట్టనివాడిని

లోతులలోకి వెళ్తా

ఉన్నతభావాలు వెలువరిస్తా


మనసుపై

ఆంక్షలులేనివాడిని

ఊహలను ఊరిస్తా

మేధోమదనం చేస్తా


కాలంపై

కాపలాలేనివాడిని

కోరినట్లు వాడుకుంటా

గమ్యాలను చేరుకుంటా


స్వేఛ్ఛ

నా ఆయుధం

సేవ

నా ధ్యేయం


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం  


Comments

Popular posts from this blog