అద్భుతంగా జరిగిన కాలిఫోర్నియా 154వ వీక్షణం సాహితీ గవాక్షం అంతర్జాల సాహితీ సమావేశం
సమీక్షకులు ప్రసాదరావు రామాయణం, కావలి
**************************************************
నేడు 21-06-2025 వ తేదీ శనివారం వీక్షణం 154 వ అంతర్జాల సమావేశం చాలా అద్భుతంగా జరిగింది. వీక్షణం వ్యవస్థాపకురాలు డా. గీతామాధవి గారు గొప్ప కవయిత్రి, కథా రచయిత్రి, నవలాకారిణి, నటి, సంగీత నిధి, గాయని. దేశాలన్నీ తిరుగుతూ తెలుగు భాషావ్యాప్తికై ఉపన్యాసించడమే కాకుండా సిలికాన్ ఆంధ్రాలో ఎన్నో తెలుగు పాఠశాలలను నడుపుతున్నారు. ఒక మస్తకంతో పది హస్తాలతో పనిజేస్తున్నారు.
ఉదయం 6 గంటల 30 నిమిషాలకు ప్రారంభమైన సమావేశం గీతామాదవి గారి స్వాగత వచనాలతో ప్రారంభమైంది.
ముఖ్య అతిథి డా. టి.గౌరీశంకర్ గారిని గీతామాదవి గారు సభకు పరిచయం చేశారు. హైదరాబాద్ లో జన్మించిన గౌరీశంకర్ గారు తెలుగు ఏం ఎ చేశారు. తెలుగు సీనియర్ ఆచార్యులు గాను జర్నలిస్ట్ గానూ పేరు ప్రఖ్యాతులు గడించారు.పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో రిజిస్ట్రార్ గా పనిచేసి పదవీ విరమణ చేశారు.
వారు భాషకు నిర్వచనం దగ్గరనుండి వివిధ భాషలు ఎలా ఏర్పడినాయి వాటి చరిత్రను వివరించారు. మనదేశంలో చాలా భాషలు ఉన్నాయని,అందు గుర్తింపబడిన భాషలు 22 అని చెబుతూ మన తెలుగు భాష ద్వితీయ స్థానం నుండి చతుర్థ స్థానానికి పడిపోవడం బాధాకరమని అంటూ దానికి గల కారణాలను వివరించారు. తెలుభాషయొక్క ప్రత్యేకతలు,వైశిష్ట్యాన్ని గురించి వివరించారు. షుమారు 45 నిమిషాలు సెలయేటి ఝరిలా వారు ప్రసంగించిన తీరు అనన్యం!
కొందరి శ్రోతల స్పందన పిదప శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గారు, శ్రీమతి కొడాటి అరుణ గారి నిర్వహణలో కవి సమ్మేళనం జరిగింది. తొలిగా శ్రీ గౌరీశంకర్ గారు తన పొట్టికవిత "నల్లని పలకపై తెల్లని గీతలు" అనే కవిత చదివి శుభ ఆరంభాన్ని ఇచ్చారు. తరువాత డాక్టర్ గీత గారు "తప్పిపోయిన ఉత్తరం" అనే తమ కవితలో ఉత్తరాలు వ్రాసుకునే మధురమైన రోజులను గుర్తు చేశారు. మాటలు తెగిపడిన అవయవాలయ్యాయని వాపోయారు. ఉభయ కుశలోపరి అనే మాట వాడుకలో లేకుండా పోయిందన్నారు.
శ్రీ నాళేశ్వరం శంకరం గారు మాతృభాషను తల్లిలా చూడాలంటూ చదివిన కవిత అందరినీ ఆకట్టుకుంది. సినీ గేయ రచయిత మౌనశ్రీ మల్లిక్ గారు తన శ్రావ్యమైన కంఠంతో అంతర్ముఖీనం అనే కవితలో చెట్టూ, పుట్టా శుక పికాలు కూడా మనతో మాట్లాడతాయి మాట్లాడే మనసు మనకుంటే అని చెప్పారు.కవిత చాలా బాగుంది. శ్రీ ఘంటా మనోహర్ రెడ్డి గారు తనదైన తాళ ధ్వనితో ఘంటారావం అనే కవిత శ్రోతలను ఆకర్షించింది. శ్రీమతి కొదాటి అరుణగారు వీక్షణం సమావేశాల గురించి శనివారం వస్తుందంటే వీక్షణం గుర్తొస్తుంది అని చక్కగా పాడారు. శ్రీ అయ్యలరాజు సోమయాజుల ప్రాడ్ గారు యోగా గురించి చెబుతూ కాదేదీ వయసుకనర్హం అన్నారు. శ్రీ పెద్దూరి వెంకటదాస్ గారు తెలుగుభాషా ఔన్నత్యం గురించి కవిత చదివారు. శ్రీ కొత్తూర్ వెంకటేష్ గారు తన కవితలో విద్యార్థులు ఎలా తమ మేధను ఉపయోగించుకోవాలో చెప్పారు.
ప్రసాదరావు రామాయణం గారు "పారేసుకున్నాడు మనిషి ఎక్కడో మానవతకే వరమైన మందహాసం " అంటూ మందహాసం మాయమోదానికి గల పరిస్థితులను వివరించాను. శ్రీ కందుకూరి శ్రీరాములు గారు క్రొత్త ప్రపంచం అనే తన కవితలో తెలుగు వ్రాయడంలోని ఇబ్బందులను తెలియచేశారు. అరుణ కీర్తి పతాకరెడ్డి గారు రైతు నేపథ్యాన్ని తీసుకుని శ్రామికులం అనే కమ్మని పాటపాడారు. డాక్టర్ చీదెళ్ల సీతాలక్ష్మి గారు " జీవన సంజీవిని" అనే కవితలో యోగా ప్రాధాన్యాన్ని వివరించారు. అవధానం అమృతవల్లి గారి తపిస్తూ కవిత అందరినీ ఆకట్టుకుంది. పరిమి వెంకట సత్యమూర్తి గారు అహమ్మదాబాద్ విమాన ప్రమాదాన్ని గురించి కవిత వినిపించారు. భోగెల ఉమామహేశ్వరరావు గారు యోగాసనాలు కవిత వినిపించారు. డాక్టర్ మల్కని విజయలక్ష్మి గారు శాసనం అనే కవితను వినిపించారు. ఉప్పలపాటి వెంకటరత్నం గారు తెలుగదేలయన్న, మరియు రామలింగేశ్వరస్వామిపై పద్యాలు వినిపించారు. పరాంకుశం కృష్ణవేణి గారు "చిరునవ్వుల చిరునామా" అనే కవిత అద్భుతంగా ఉంది. శ్రీ గుర్రం మల్లేశం గారు "వెలుగు జిలుగు " అని తోలకరిపై పద్యాలు చదివారు. శ్రీ ఆది మోపిదేవి (కమర) గారు అగ్గిరాజు రాజ్యమేలితే అనే బ్రహ్మాండమైన కవితను వినిపించారు. .
శ్రీ మేడిశెట్టి యోగేశ్వరరావు గారు జీవితం అనే తన కవితను నర్తనంలా ఉంది. ఆనం ఆశ్రితారెడ్డి గారు విమాన ప్రమాదాన్ని గురించి కవిత్వరీకరించారు. డాక్టర్ బృంద గారు హృదయ హారతి అనే తమ కవితలో యోగా ప్రాధాన్యతను చెప్పారు. జోరు
పవిత్ర కృష్ణ గారు బాలికావళి అనే కవితలో ఆడపిల్లల కష్టాల గురించి ఆర్ద్రంగా కవిత వినిపించారు. సుధా కొలచన గారు "తెలివి తెచ్చుకో" అనే తన కవితను తెలంగాణా యాసలో చదివి అందరినీ ఆకట్టుకున్నారు.శోభా దేశ పాండే గారు విమాన ప్రమాదంపై కవిత వినిపించారు. బలుసాని వనజ గారు అవార్డులు అనే పాటను విద్యార్థుల బాధ్యత అనే అంశంపై పాడారు. చివరగా శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గారు తన సహజమైన గంభీర స్వరంతో "సాహిత్య సౌరభాలు" అనే కవితతో నిజం గానే సౌరభాలు వెదజల్లారు. అందరి మన్ననలను పొందారు.
డాక్టర్ కె గీతామాదవి గారి వందన సమర్పణతో 154 వ సమావేశం ముగిసింది. సమావేశం ఆద్యంతం ఆసక్తికరంగా సాగిందని పాల్గొన్న వారందరూ ఆనందం వ్యక్తపరిచారు.
డాక్టర్ గీతామాధవి & గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, నిర్వాహకులు, వీక్షణం 154 వ సమావేశం
Comments
Post a Comment