నా తెలుగుభాష
నా భాషలో
నే చెబుతా
నచ్చితే ఆలకించు
మెచ్చితే పులకరించు
నా భాషలో
నే వ్రాస్తా
కావాలంటే పఠించు
కమ్మగుంటే ఆస్వాదించు
నా భాషలో
నే పాడుతా
గేయాన్ని వల్లించు
గానాన్ని అనుకరించు
నా భాషలో
నే నేర్పుతా
మాతృభాష చరిత్రను
మహాకవుల కావ్యాలను
నా భాషలో
నే ఆలోచిస్తా
విప్పుతా మనసును
తట్టుతా హృదులను
నా భాషలో
నే మునుగుతా
ఏరి చల్లుతా అక్షరాలు
కోరి పారిస్తా పదాలు
నా భాషలో
నే పిలుస్తా
తీస్తా చెంతకు
కలుపుతా చేతులను
నా భాషలో
నే ప్రసంగిస్తా
చెబుతా ముచ్చట్లు
కొట్టిస్తా చప్పట్లు
నా భాష
చక్కని తెలుగు
నా మాటలు
తెల్లారి వెలుగు
నా భాష
అమృత భాండాగారము
నా కైతలు
లేత కొబ్బరిపలుకులు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment