రసవత్తరంగా నేడు (19-09-25) జరిగిన వీక్షణం సాహితీగవాక్షం(కాలిఫోర్నియా) వారి 155వ అంతర్జాల సాహితీసమావేశం
**************************************************************
సమీక్షకులు: ప్రసాదరావు రామాయణం
భారత కాలమానం ప్రకారం ఈరోజు 19-07-25 శనివారం ఉదయం 6-30గం ప్రారంభమైన సమావేశం గం.9-45వరకు ఆసక్తిదాయకంగా జరిగింది. తొలుత డా.గీతామాధవిగారి స్వాగతోపన్యాసంతో సభ ప్రారంభమైంది. ఈనాటి ముఖ్య అతిథి ఆచార్య మాడభూషి సంపత్కుమార్ గారిని ఆహ్వానించి వారిని సభకు పరిచయం చేశారు. శ్రీ మాడభూషి గారు గొప్ప భాషావేత్త, విమర్శకులు .మద్రాస్ యూనివర్సిటీలో ఎరుకల భాషపై ఏం ఫిల్ చేశారు.షుమారుగా 60 గ్రంథాలు వ్రాశారు. వారికి చాలా పురస్కారాలు లభించాయి.
మాడభూషి గారు ఆధునిక కవిత్వంపై అనర్గళంగా 50 నిమిషాలపాటు మాట్లాడారు.
శ్రీశ్రీగారి 'కవితా..ఓ కవితా ' అనే కవితను చదివితే ఆధునిక కవిత్వం ఎలా వ్రాయాలి అనే వారికి ఒక పాఠమే అన్నారు. వచన కవిత్వం ఒక ప్రజాస్వామ్యం లాంటిదేనన్నారు. కవులు వస్తువును ఎంచుకోవడంలో భాషా,శైలిపై దృష్టి పెట్టాలన్నారు.కవిత్వ ప్రయోజనాలను వివరించారు. కవులందరూ వారి ఉపన్యాసాన్ని శ్రద్ధగా చెవులు రిక్కించి విన్నారు. వారి ఉపన్యాసంపై గీతమ్మ, సాధనాల వారూ ,నేనూ, శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారూ స్పందించి కొన్ని సందేహాలను నివృత్తి చేసుకున్నాము.
పిదప శ్రీ గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో కవిసమ్మేళనం ప్రారంభమైంది.
తొలుతగా శ్రీ మాడభూషిగారు 'స్వర్గం' అనే కవితను రసరమ్యంగా చదివి వినిపించారు.
డా.గీతామాదవిగారు "మా పెరటి నారింజ చెట్టు"నాకు తల్లి అయ్యింది అంటూ అద్భుతమైన భావుకతతో వినిపించిన కవిత అందరినీ ఆకట్టుకుంది. శ్రీ నాళేశ్వరం శంకరంగారు డాలర్ కాలం అనే సెటైరికల్ కవిత వర్తమానానికి అద్దం పట్టింది. డాక్టర్ చీదెళ్ళ సీతాలక్ష్మి గారు అంతం లేని వ్యధ అనే వారి కవితలో పిల్లలు రెక్కలొచ్చి ఎగిరిపోయాక తలిదండ్రులు పడే వేదనను ఆర్ద్రంగా వినిపించారు.శ్రీ పరిమి వెంకట సత్యమూర్తి గారు కల్తీ అనే కవితలో సమాజంలోని అవినీతిని ఎండగట్టారు.
శ్రీ సాధనాల వెంకటస్వామి నాయుడు గారు రిక్షావాలా అనే వారి కవితలో శ్రామికుల కస్టాలను వివరించారు.డాక్టర్ బుక్కపట్నం రమాదేవి గారు చిరుదరహాసం అనే కవితలో నవ్వు వైశిష్ట్యాన్ని అందంగా చెప్పారు. కొత్తూరు వెంకటరత్నం గారు శ్రీనివాసునిపై మాల వేసెనే అనే భక్తి గీతాన్ని ఆలపించారు. బలుసాని వనజ గారు బోనాల పండుగపై శ్రావ్యంగా పాడారు. శ్రీ వెంకట దాస్ గారు నాన్న గొప్పతనాన్ని తన కవితలో వినిపించారు. బూర దేవానందం గారు అమ్మపై చెప్పిన కవిత్వం బావుంది. శ్రీ అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు భార్య మరణిస్తే "ఏదో తెలియని ఆవేదన" కవిత కన్నీరు తెప్పించింది. శ్రీ ఘంటా మనోహరం గారు ఆశాపరుల గురించి వ్యంగ్యంగా చెప్పారు. శ్రీ రామకృష్ణ చంద్రమౌళి గారు ఆవకాయ గురించి చదివిన కవితకు అందరూ హాయిగా నవ్వారు.డాక్టర్ కందేపి రాణి ప్రసాద్ హస్తకళాకారుల గురించి కవితను చక్కగా వినిపించారు.
సినీ రచయిత శ్రీ మౌనశ్రీ మల్లిక్ గారు తన విశ్వశిఖరం అనే కవితలో మోసం చెయ్యడం మద్యం మూత తీసినంత సులభం అంటూ తన గంభీర స్వరంతో ఆవేశపూరితంగా చదివిన కవితకు చప్పట్లు మ్రోగాయి. శ్రీ కందుకూరి శ్రీరాములు గారు మాట్లాడుకుందాం అంటూ మాటలు మరుగౌతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రసాదరావు రామాయణం "గంట నాటకం " అనే కవితలో ఈ జీవితం ఒక నాటకం.అందరూ అరువుగాళ్లే తెరపడగానే అందరూ రంగు తుడుచుకుని పోయే వాళ్ళే.ఈ మాత్రానికే ఇన్ని ఘోరాలు పాపాలు చెయ్యాలా అంటూ ప్రశ్నించారు.
కరాదుల అరుణ కీర్తి ప్రతాప్ రెడ్డి గారు సంగీతపు ప్రాధాన్యత తెలుపుతూ శ్రావ్యంగా, హాయిగా గజల్ పాడి వినిపించారు చాలా బావుందని అందరూ ప్రశంసించారు. అవధానం అమృతవల్లిగారు ",నీవే నేనుగా " అనే కవితలో నువ్వెందుకు నా వెంటబడుతున్నావు అంటూ చదివిన కవిత అందరి ప్రశంసలను అందుకుంది. మేడిశెట్టి యోగేశ్వరరావు గారు భక్తి గురించి వ్యంగ్యంగా వ్రాసిన కవిత బావుంది.ఉప్పలపాటి వెంకటరత్నం గారు రైతుయొక్క ప్రాశిస్త్యాన్ని తన గజల్ లో కమ్మగా పాడి వినిపించారు.
డాక్టర్ కొడాటి అరుణ గారు తన"మనసులోని భావాలు"అనే కవితలో కవితాలక్షణాలగురించి చక్కగా వినిపించారు. పరాంకుశం కృష్ణవేణి గారు మార్గదర్శనం అనే కవిత చాలా పసందుగావుంది. చదివిన తీరు రమ్యంగా వుంది. డాక్టర్ దేవులపల్లి పద్మజ గారు గురువు పై పద్యాలు వినిపించారు. గురువు యొక్క లక్షణాలను,ప్రాధాన్యతను వివరించారు.శ్రీ బిటవరం శ్రీమన్నారాయణ గారి శీర్షిక పేరు సరిగా వినిపించలేదు.కానీ కవితాంశం రమణీయంగా వుండినది. డా.బృందగారు ప్రశ్నల నామావళి అనే కవిత చదవగా శోభాదేశ్ పాండేగారు బోనాలు పండుగ గూర్చి శోభాయమానంగా చదివారు. శ్రీ ఉమామహేశ్వరరావు గారు త్రివర్ణపతాకం అనే కవిత చదివి శ్రీ పింగళి వెంకయ్య గారి గురించి చెప్పారు. ఆనం ఆశ్రితారెడ్డి అన్నీ నేనే అని అర్ధంవచ్చేలా మంచి స్వీయ కవితను వినిపించారు. శ్రీ చిట్టాబత్తిన వీరరాఘవులు గారు అక్షరాలసాక్షి అనే కవితను చదివారు.
చివరిగా శ్రీ గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్ గారు "తెలుగు తడాకా" అనే కవితను చిక్కని స్వరంతో, కవితార్థాన్ని అభినయిస్తూ చదివిన తీరు అందరినీ ఆకట్టుకుంది.ఈ కవిత పేపర్లో ప్రచురితమై విశేష ఆదరణ పొందింది.
గీతమ్మ వందన సమర్పణతో సాహితీ సభ ముగిసింది.సభను చక్కగా నడిపించినందుకు అందరూ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు.
వీక్షణం సాహిత్యవేదిక కాలిఫోర్నియా
Comments
Post a Comment