భార్యలపాత్రలు బహుకోణాలు
భార్య ఇంటికడుగుబెడుతుంది
సిగ్గుతో తలవంచుకొని
సోకులతో అలంకరించుకొని
ఆశలతో మదినినింపుకొని
భార్య అందరినలరిస్తుంది
అందము చూపించి
అనురాగము వ్యక్తపరచి
అంతరంగాలను మురిపించి
భార్య చేస్తుంది
ఇంటిసాకిరి
వంటపని
వడ్డనలకార్యాన్ని
భార్య భరిస్తుంది
అత్త ఆరడింపులు
ఆడపడచు వ్యంగాలు
మగని మౌనము
భార్య అపుడుమొదలబెడుతుంది
నిజస్వరూపాన్ని
ఇంటిపెత్తనాన్ని
గయ్యళితనాన్ని
భార్య అడుగుతుంది
సరుకులు
చీరెలు
నగలు
భార్య పెడుతుంది
భోజనాలు
అల్పాహారాలు
తినుబండారాలు
భార్య గణిస్తుంది
ఆదాయవివరాలు
ఖర్చులలెక్కలు
మిగులుడబ్బులు
భార్య చూపుతుంది
అందం
అభిమానం
ఆధిపత్యం
భార్య ఇస్తుంది
ఆనందం
మకరందం
అమృతం
భార్య వెలుగుతుంది
దీపంలా
జాబిలిలా
తారకలా
భార్య కాచుకుంటుంది
భర్తను
పిల్లలను
ఇల్లును
భార్య చిందుతుంది
చిరునవ్వులు
సుమసౌరభాలు
తేనెపలుకులు
భార్య కోరుకుంటుంది
ఆదరణ
ప్రేమ
పొగడ్త
భార్య భాద్యతతీసుకుంటుంది
ఇంటి శుభ్రతకు
పిల్లల క్రమశిక్షణకు
కుటుంబ గౌరవమునకు
భార్య అలుగుతుంది
కోరింది ఇవ్వకపొతే
చెప్పింది వినకపోతే
సుఖాలని అందించకపోతే
భార్య చివరకుచూపుతుంది
గడుసుతనము
గయ్యాళితనము
గాంభీర్యము
భార్యపాత్ర పోషించటం
కత్తిమీదసాము
నిప్పుతోచెలగాటము
నిందాస్తుతులస్వీకారము
భార్య గెలిస్తే
పేరుగడిస్తుంది
మర్యదపొందుతుంది
అందలమెక్కుతుంది
భార్య విఫలమైతే
తిట్లుతింటుంది
దెబ్బలకుగురవుతుంది
పోరాటలుచేస్తుంది
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment