చిక్కుతున్నా! చెలరేగుతున్నా!!


ఊహైనా కావచ్చు

ఉద్రేకమైనా కావచ్చు

ఉల్లాన్ని ఊపుతుంది

ఉత్సాహాన్ని కలిగిస్తుంది


శబ్దమైనా కావచ్చు

దృశ్యమైనా కావచ్చు

నన్ను ముట్టుతుంది

మేల్కొలుపు పాడుతుంది


అక్షరమైనా కావచ్చు

పదమైనా కావచ్చు

నన్ను తట్టుతుంది

నిద్ర లేపుతుంది


అందమైనా కావచ్చు

ఆనందమైనా కావచ్చు

నన్ను ఆకర్షిస్తుంది

అంతరంగాన్ని అలరిస్తుంది


పువ్వైనా కావచ్చు

నవ్వైనా కావచ్చు

నన్ను రెచ్చకొడుతుంది

కవనరంగంలోకి దింపుతుంది


వెన్నెలైనా కావచ్చు

సౌరభమైనా కావచ్చు

నన్ను కట్టేస్తుంది

మదిని దోచేస్తుంది


కలమైనా కావచ్చు

కాగితమైనా కావచ్చు

కవితలు రాయమంటుంది

కవనజగాన్ని రంజింపజేయమంటుంది


భావమైనా కావచ్చు

విషయమైనా కావచ్చు

నాలో పుడుతుంది

నన్ను ఉసిగొల్పుతుంది


ప్రేమైనా కావచ్చు

ప్రేరణైనా కావచ్చు

నన్ను ఆవహిస్తుంది

మనసుకు పనిపెడుతుంది


రక్తైనా కావచ్చు

భక్తైనా కావచ్చు

నన్ను వశపరచుకుంటుంది

కవనాలలోకి కాలుపెట్టిస్తుంది


బాగుండేలా భ్రమలుకొలుపుతున్నా

స్పందించేలా మదులుతాకుతున్నా 

పత్రికలు ప్రచురిస్తున్నాయి

ప్రాచుర్యం కలిపిస్తున్నాయి


నచ్చేమాటలజాడలో పయనిస్తున్నా

మెచ్చేరీతిలో పలువురినిపట్టేస్తున్నా 

పాఠకులు పరవశిస్తున్నారు

ప్రతిస్పందనలు గుప్పిస్తున్నారు


ప్రోత్సహించేవారి గుండెలు 

ఉప్పొంగిస్తున్నా

ముచ్చటించేవారి మదులు

ఉజ్వలింపజేస్తున్నా


వెన్నుతట్టేవారికి

విందునిస్తున్నా

అండగానిలిచేవారికి

పసందులందిస్తున్నా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం  


Comments

Popular posts from this blog