పైపై మెరుగులు
అల్లానికి
బెల్లం జోడిస్తున్నారు
ఆరగించటానికి
అరిగించుకోటానికి
చేదుగుళికలకు
తీపిని అంటిస్తున్నారు
జారమ్రింగటానికి
ఆరోగ్యంగా ఉండటానికి
వస్త్రాలపై
అత్తరు చల్లుకుంటున్నారు
దుర్గంధాన్ని దాచటానికి
పక్కవారిని మభ్యపెట్టటానికి
తలలకి
నూనె అంటుకుంటున్నారు
కేశాలను అణచిపెట్టటానికి
చింపిరిని అదుపుచెయ్యటానికి
కన్యలు వక్షస్థలంపై
పైటలు కప్పుకుంటున్నారు
అందాలు దాచుకోవటానికి
మాయలోనికి నెట్టటానికి
అధరాలకు
రంగు పూసుకుంటున్నారు
ఆకర్షించటానికి
అమృతముందని చెప్పటానికి
ఏడుపును
లంకించుకుంటున్నారు
నమ్మించటానికి
సానుభూతి పొందటానికి
పడతులు
పూలు పెట్టుకుంటున్నారు
పొంకాలు చూపటానికి
ప్రేమలో దింపటానికి
కళ్ళకు కాంతలు
కాటుక పెట్టుకుంటున్నారు
కాంతులు చిమ్మటానికి
కళకళలాడి కట్టేయటానికి
కావాలని కొందరు
పొగడ్తలు గుప్పిస్తున్నారు
ప్రసన్నులను చేసుకోటానికి
పనులను చేయించుకోటానికి
మాటలకు
తేనెను అద్దుకుంటున్నారు
ఆకట్టుకోటానికి
అంతరంగాలు తట్టటానికి
అర్ధాంగులు
అలకపానుపు ఎక్కుతున్నారు
బ్రతిమాలించుకోవటానికి
మొగుడిని చెంగునకట్టిపడేయటానికి
పైమెరుగులను
పసికట్టాలి
దృష్టిపైపైగాక
లోతులకెళ్ళాలి
వాస్తవాలను
తెలుసుకోవాలి
మర్మాలనెరిగి
మసులుకోవాలి
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment