కవనరంగం
(సాహితీక్షేత్రం)
ఇక్కడనే
కవికమలాప్తుడు ఉదయించు
కవనకాంతులు ప్రసరించు
ఇక్కడనే
కవనపుష్పాలు వికసించు
సుమసౌరభాలు వ్యాపించు
ఇక్కడనే
చక్కనిజాబిలి కనిపించు
చల్లనివెన్నెల కురిపించు
ఇక్కడనే
నీలిమేఘాలు తేలియాడు
తారలు తళుకులుచిమ్ము
ఇక్కడనే
అక్షరతీగలు అల్లుకొను
పదాలు పసందుకొలుపు
ఇక్కడనే
కవులకలాలు కదులుచుండు
కమ్మనికైతలు కాగితాలకెక్కు
ఇక్కడనే
సాహిత్యసేద్యము సాగుచుండు
కవితాపంటలు పండుచుండు
ఇక్కడనే
పంచభక్ష్యాలు వడ్డించబడు
నవరసాలు లభ్యమగుచుండు
ఇక్కడనే
కవిసమ్మేళనాలు జరుగుచుండు
సన్మానసత్కారాలు చేయబడు
ఇక్కడనే
పురస్కారాలు అందించబడుచుండు
పుస్తకాలు ఆవిష్కరించబడుచుండు
ఇక్కడనే
కవులప్రతిభలు బయటపడుచుండు
వాగ్దేవివాక్కులు వెలువడుచుండు
ఇక్కడనే
మదులుపఠించి మురిసిపోవుచుండు
హృదులాస్వాదించి ఊయెలలూగుచుండు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment