నా పెళ్ళాం


బంగరుబొమ్మ నాముద్దులగుమ్మ

ఇంటికొచ్చిన లక్ష్మినంటది

తాళికట్టిన పెళ్ళాన్నంటది

అపరూపంగా చూడాలంటది            ||బంగరు|| 


సెల్లు చేతబడితే

ప్రక్కగదికి వెళ్ళమంటది

గడ్డం చేసుకోకపోతే

చెంతకు రావద్దంటది            


కూర బాగులేదంటే

కోప్పడతది కేకలేస్తది

స్నానము చేయకపోతే

దూరంగా జరగమంటది               ||బంగరు||


ఒకటోతేదీ డబ్బులివ్వకపోతే

మూతిబిగిస్తది పస్తుబెడతది

ఆడవారితో మాట్లాడితే

కస్సుమంటది బుస్సుమంటది            


పండుగ వచ్చిందంటే

చీరెలడుగుతది నగలుకోరుతది

కోరికలు తీర్చకపోతే

ఏడుస్తది అలకపానుపెక్కుతది           ||బంగరు||


గయ్యాళివంటే

గొడవచేస్తది బెట్టుచేస్తది

గడసరివంటే

గంతులేస్తది గొంతుచించుకుంటది


ఆలశ్యంగా ఇంటికొస్తే

అనుమానిస్తది నిందలేస్తది

ఇచ్చిన డబ్బులలెక్కలడిగితే

ఛీకొడుతది గీకొడుతది                ||బంగరు||


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 


Comments

Popular posts from this blog