గాలి కబుర్లు
(గాలి మాటలు ముచ్చట్లు మాయలు మర్మాలు)
గాలి వీస్తుంది
చల్లగా
చిన్నగా
చక్కగా
గాలి పిలుస్తుంది
రమ్మని
తిరగమని
ఆనందించమని
గాలి అరుస్తుంది
హోరుగా
జోరుగా
దురుసుగా
గాలి ఊపుతుంది
కొమ్మలను
కొంగులను
కేశాలను
గాలి లేపుతుంది
దుమ్ముధూళులను
కడలికెరటాలను
ఎత్తైనచెట్లను
గాలి తరుముతుంది
కంపుని
కుళ్ళుని
కల్మషాన్ని
గాలి తెస్తుంది
కొండల వేడిని
సముద్రాల తడిని
పొలాల పొడిని
గాలి మోసుకొస్తుంది
రేడియో తరంగాలను
టీవీ శబ్దచిత్రాలను
అంతర్జాల సంకేతాలను
గాలి తడుతుంది
మేనులను
మనసులను
మనుషులను
గాలి తలపులుమళ్ళిస్తుంది
ప్రేమ మీదకు
ప్రేయసి మీదకు
పెళ్ళి మీదకు
గాలి వినిపిస్తుంది
శబ్దాలని
స్వరాలని
సంగీతాన్ని
గాలి మదినిమరలిస్తుంది
అక్షరాల పైకి
పదాల పైకి
కవితల పైకి
గాలిమాటలు చెవిలోపడితే
కట్టేయ్యాలి
కుట్టెయ్యాలి
కొట్టెయ్యాలి
గాలికబుర్లను చెప్పితే
వినకూడదు
విశ్వసించకూడదు
వ్యాప్తిచేయకూడదు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment