మేమిద్దరం
మేమిద్దరం
మాట్లాడుకుంటుంటే
కాలం
కదలటానికి జంకుతుంది
మేమిద్దరం
మురిసిపోతుంటే
వెలుగు
కరిగిపోవటానికి భయపడుతుంది
మేమిద్దరం
పెనవేసుకుంటే
కళ్ళు
చూడటానికి సందేహిస్తాయి
మేమిద్దరం
ఆటాడుకుంటుంటే
ఆనందం
అధరాలను వీడకుంటుంది
మేమిద్దరం
కలసినడుస్తుంటే
పయనం
అలసటలేకుండా సాగుతుంది
మేమిద్దరం
ఊరేగుతుంటే
సమాజం
దప్పుకొట్టి గళమెత్తుతుంది
మేమిద్దరం
అవిభాజ్యం
నేను పురుషుడిని
ఆమె ప్రకృతి
మేమిద్దరం
ఒకరికొకరం
నేను ఇనుపముక్కను
ఆమే ఆయస్కాంతము
మేమిద్దరం
వేరుకాదు
నేను అందం
ఆమె ఆనందం
మేమిద్దరం
తోటిప్రయాణికులం
గడుపుతాం జీవితం
చేరతాం గమ్యం
మట్టి పరుపై
నిద్రబుచ్చుతుంది
కొమ్మ ఊయలై
ఊపుతుంది
అగ్ని మంటై
వండిస్తుంది
అవని భోజనమై
వడ్డిస్తుంది
గాలి పంఖాయై
వీస్తుంది
మబ్బు నీటిచుక్కలై
కురుస్తుంది
పచ్చదనంతో
చెట్లు పరవశపరుస్తుంటే
ఇంద్రధనసుతో
ఆకాశం అబ్బురపరుస్తుంది
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment