కవ్వింపులు
మల్లేవాసన
పిలుస్తుంటే
సమ్మతిస్తున్నా సంగ్రహిస్తున్నా
సంతసిస్తున్నా
పున్నమివెన్నెల
స్వాగతిస్తుంటే
అంగీకరిస్తున్నా ఆస్వాదిస్తున్నా
ఆనందిస్తున్నా
చక్కనికన్నియ
చతుర్లాడుతుంటే
స్వీకరిస్తున్నా స్పందిస్తున్నా
సంబరపడుతున్నా
రంగులసుమాలు
రమ్మంటుంటే
రయ్యనవెళ్తున్నా రమ్యతచూస్తున్నా
రసాస్వాదనచేస్తున్నా
కడలికెరటాలు
ఎగిసిపడుతుంటే
వీక్షిస్తున్నా విహరిస్తున్నా
వినోదిస్తున్నా
నింగిననీలిమబ్బులు
కదులుతుంటే
నిద్రించలేకున్నా నివ్వెరపోతున్నా
నిశ్ఛేష్టుడనవుతున్నా
చెలిచిరునవ్వులు
చిందుతుంటే
బదులిస్తున్నా బందీనవుతున్నా
భ్రమల్లోపడుతున్నా
అందాలదృశ్యాలు
కాంచమంటుంటే
క్రోలుకుంటున్నా దాచుకుంటున్నా
పదేపదేతలచుకుంటున్నా
సహజప్రకృతి
ప్రోత్సహిస్తుంటే
పరికిస్తున్నా పరవశపడుతున్నా
పురుషుడనవుతున్నా
మనసు
కవ్విస్తుంటే
రెచ్చిపోతున్నా రగిలిపోతున్నా
రంగంలోకిదిగితున్నా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment