ఒలకబోతలు


ఒలకబోసిన

వయ్యారాలు

రేపుతున్నాయి

మానసిక ఉద్వేగాలు


ఒలకబోసిన

చిరునవ్వులు

వెలిగిస్తున్నాయి

అందాల మోములు


ఒలకబోసిన 

రాగాభిమానాలు

మురిపిస్తున్నాయి

ప్రేమికుల మదులు


ఒలకబోసిన

తేనీరు

మార్చుకోమంటున్నాయి

తడిసిన దుస్తులు


ఒలకబోసిన

పాఠాలు

తప్పక మళ్ళీచెబుతున్నాడు

పాఠశాలలో పంతులు


ఒలకబోసిన

చేటబియ్యము

తిట్టుకుంటూ ఎత్తుచున్నది

ఇంటి ఇల్లాలు


ఒలకబోసిన

కన్నీరు

కరిగిస్తున్నది

కఠిన హృదయాలు


ఒలకబోసిన

అక్షరాలు

చిందుతున్నాయి

దివ్వెల వెలుగులు


ఒలకబోసిన

మాటలు

ముట్టుతున్నాయి

హృదుల మీటలు


ఒలకబోసిన

భావాలు

లేపుతున్నాయి

మదిన భ్రమలు


ఒలకబోసిన

నిత్య చేష్టలు

పుట్టిస్తున్నాయి

హృదిన తలపులు


ఒలకబోసిన

జీవన క్షణాలు

రంగులద్దుతున్నాయి

మనసుల పుటలకు


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 

Comments

Popular posts from this blog