మధురక్షణాలు
జాబిలి పొడిచే — వెన్నెల కురిసే
హృదయం పొంగే — మధుర క్షణమయ్యే
మబ్బులు లేచే — చినుకులు చల్లే
మనసు ఉప్పొంగే— మధుర క్షణమయ్యే
సూరీడు వచ్చే— అరుణోదయం అయ్యే
చీకటిని తరిమే — మధుర క్షణమయ్యే
పువ్వులు పూసే — పరిమళం చల్లే
అంతరంగం అలరారే — మధుర క్షణమయ్యే
నవ్వులు చిందే — మోములు వెలిగే
ఆనందం పంచే — మధుర క్షణమయ్యే
చెలి చెంతచేరే — సొగసులు చూపే
ఉల్లాసం నింపే — మధుర క్షణమయ్యే
చిత్రకారుడు కుంచెపట్టే — రంగులగీతలు గీచే
అందాలాబొమ్మను సృష్టించే — మధుర క్షణమయ్యే
కవివరేణ్యుడు కలంపట్టే — అక్షరముత్యాలు జార్చే
మనసును హత్తుకొనే — మధుర క్షణమయ్యే
మధురక్షణాలను ముందుంచినందుకు
కవులకు చిత్రకారులకు వందనాలు అభివందనాలు
మానవ జీవితమంతా అపరూపక్షణాల పండుగే
చక్కని దృశ్యాలమయమే ఆనంద సమయాలే
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ – భాగ్యనగరం
Comments
Post a Comment