ఈ కవితలో… నేను
మీరు చదివే — ఈ కవితలో
కొన్ని పంక్తులున్నాయి…
కొన్ని పదాలున్నాయి…
కొన్ని అక్షరాలున్నాయి…
మీరు చూసే — ఈ కవితలో
కొన్ని దీపాలున్నాయి…
కొన్ని వెలుగులున్నాయి…
కొన్ని చిత్రాలున్నాయి…
మీరు ఆలకించే — ఈ కవితలో
కొన్ని శబ్దాలున్నాయి…
కొన్ని స్వరాలున్నాయి…
కొన్ని గీతికలున్నాయి…
మీరు మనసుపడే — ఈ కవితలో
కొన్ని ఆలోచనలున్నాయి…
కొన్ని కల్పనలున్నాయి…
కొన్ని భావనలున్నాయి…
మీరు ఆస్వాదించే — ఈ కవితలో
చక్కెర రసముంది…
తేనె చుక్కలున్నాయి…
తీపి మిఠాయిలున్నాయి…
మీరు ఇష్టపడే — ఈ కవితలో
ప్రాసలు పొదిగాయి…
పోలికలు పూచాయి…
పరిమళాలు విరిచాయి…
మీరు మునిగిపోయిన — ఈ కవితలో
వాన జల్లులు కురుస్తున్నాయి…
తనువును తడిపేస్తున్నాయి…
చిందులు త్రొక్కిస్తున్నాయి…
మీరు మెచ్చుకునే — ఈ కవితలో
అందాలు దాగివున్నాయి…
ఆనందాలు అందిస్తున్నాయి…
అంతరంగమును అంటుతున్నాయి…
మీకు ఈ కవితలో —
నేను కనబడుతున్నానా?
నేను మాట్లాడుతున్నానా?
నేను వినబడుతున్నానా?
మీకు ఈ కవితతో —
నేను వడ్డిస్తున్నానా?
నేను రుచి చూపిస్తున్నానా?
మీ హృదయాలు తాకుతున్నానా?
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment