నా ప్రేమలు


జీవితాన్ని ప్రేమిస్తున్నా

చూచే అవకాశమిచ్చినందుకు

వినే వీలు కలిగించినందుకు

చేసే భాగ్యం ప్రసాదించినందుకు


అందాలను ప్రేమిస్తున్నా

అంతరంగం తడుతున్నందుకు

అనుభూతులు అందిస్తున్నందుకు

ఆనందాలు పంచుతున్నందుకు


పువ్వులను ప్రేమిస్తున్నా

పొంకాలతో పలుకరిస్తున్నందుకు

పరిమళాలు చల్లుతున్నందుకు

పరవశాలు పంచుతున్నందుకు


నవ్వులను ప్రేమిస్తున్నా

సంతోషం తెలియజేస్తున్నందుకు

స్పందనలు వ్యక్తం చేస్తున్నందుకు

మోములు వెలిగించుతున్నందుకు


వెన్నెలను ప్రేమిస్తున్నా

సూరీడు లేని లోటు తీరుస్తున్నందుకు

చిత్తాలను మెల్లగా తాకుతున్నందుకు

మదులను ముత్తుతూ మురిపిస్తున్నందుకు


అమ్మలను ప్రేమిస్తున్నా

జీవజాతిని కాపాడుతున్నందుకు

మంచి అలవాట్లు నేర్పిస్తున్నందుకు

సంఘాభివృద్ధి కోసం కృషి చేస్తున్నందుకు


నాన్నలను ప్రేమిస్తున్నా

పిల్లలను పెంచి పోషిస్తునందుకు

బాధ్యతల భారం మోస్తున్నందుకు

భవిష్యత్తు పౌరులను తీర్చిదిద్దుతున్నందుకు


స్నేహితులను ప్రేమిస్తున్నా

చెంతనిలిచి తోడ్పడుతున్నందుకు

సలహా, సూచనలు ఇచ్చుతున్నందుకు

సరియైన మార్గం చూపించుతున్నందుకు


సమాజాన్ని ప్రేమిస్తున్నా

వెన్నుతట్టి వెనుక నిలుస్తున్నందుకు

స్పందనలు తెలియజేస్తున్నందుకు

సంఘశ్రేయస్సు పెంచుతున్నందుకు


అక్షరాలను ప్రేమిస్తున్నా

కలలోకొచ్చి కవ్విస్తున్నందుకు

కలమును పట్టించుతున్నందుకు

కవితలు రాయించుతున్నందుకు


సాహిత్యాన్ని ప్రేమిస్తున్నా

ఆలోచనలు రేపుతున్నందుకు

భావాలను వెలికితీస్తున్నందుకు

విషయాలను బోధించుతున్నందుకు


ప్రేమను పంచటం — అదృష్టం

ప్రేమను పొందటం — భాగ్యం

ప్రేమలేని జీవితం — వ్యర్థం

ప్రేమించని బ్రతుకులు — హీనం


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog