నా ఆనందాలు
కళ్లకు కనువిందుగా — దృశ్యాలు చూడటం
చెవులకు చెలిమిగా — శబ్దాలు వినటం
రుచుల విందుగా — చవులు ఆస్వాదించటం
ఇవన్నీ నాకిస్తాయి మధురానందం
వెలుగుల తారలలా — చిమ్మిన కాంతులు
పూల సుగంధములా — చల్లిన సౌరభాలు
మనసు దోచిన మాధుర్యములా — స్నేహస్పర్శలు
ఇవన్నీ నాకుచేకూరుస్తాయి మధురానందం
వర్షపు చినుకుల్లా — ప్రేమలు కురిపించటం
వసంతపు వీచికల్లా — అభిమానం అందుకోవటం
మిత్రుని కరచాలనంలా — అన్యోన్యంగా మెలగటం
ఇవన్నీ నాకుకలిగిస్తాయి మధురానందం
సంభాషణలలో — జ్ఞానవీణ మ్రోగటం
స్వాగతాలలో — హృదయదీపం వెలగటం
సన్మానాలలో — సత్కారం సువాసన పూయటం
ఇవన్నీ నాకందిస్తాయి మధురానందం
పూలను పరికించటం — కవిత్వ పుటలలో
వెన్నెలలో విహరించటం — కలల కాగితాల్లో
కడలితరంగాలు వీక్షించటం — ఊహల లోకములో
ఇవన్నీ నాకవుతాయి మధురానందం
రంగుల రమ్యముగా — చిత్రాల అద్దటం
హంగుల హరివిల్లులా — అందాలను దిద్దటం
పొంగుల పండుగలా — ఉత్సవాలు వీక్షించటం
ఇవన్నీ నాకొసగుతాయి మధురానందం
నవ్వుల నక్షత్రాల్లా — ముఖములు వెలిగించటం
చిరునవ్వుల చినుకుల్లా — మోములు పూయించటం
సహాయం చేయటం — సూర్యరశ్మిలా నడిపించటం
ఇవన్నీ నాపాలిట మధురానందం
ఆటలలో ఉల్లాసం — పిల్లల హాసం
పాటలలో మాధుర్యం — గానసుధాస్వాదనం
బాటలు చూపటంలో — దీపస్తంభ ప్రకాశం
ఇవన్నీ నామదికిస్తాయి మధురానందం
అక్షరాల అల్లికలో — ముత్యాల జాబిలి
పదాల పేర్పులో — కవిత్వ కుసుమమాల
సాహిత్య స్రవంతిలో — మనసు మునక
అవన్నీ నాకుప్రసాదిస్తాయి శాశ్వతానందం
విఙ్ఞానం పంచటం — జ్ఞానదీపమై
వినోదం కలిగించటం — హాసరసమై
విషాదం తొలగించటం — ఆశాకిరణమై
అవన్నీ నాకెప్పటికీ మధురానందం
చేవ ఉన్నంతవరకు — కలం నడిపిస్తా
ప్రాణం ఉన్నంతవరకు — అందాలు పంచుతా
ఊహలు ఊరేంతవరకు — గీతాలు కూర్చుతా
సాహితి సహకరించేంతవరకు — కవితానందం అందిస్తా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment