నేను
మన్మధ బాణం కాదు
మాటల అస్త్రం సంధిస్తా
వ్యర్ధ కార్యాలు కాదు
అర్ధవంత పనులు చేబడతా
పుష్పాల హారం కాదు
అక్షరాల సరం అల్లుతా
సుమ సౌరభాలు కాదు
కవితా పరిమళాలు చల్లుతా
నీటి వరద కాదు
ఊహల వెల్లువ పారిస్తా
ఖనిజ అన్వేషణ కాదు
విషయ వెదుకులాట సాగిస్తా
పుటల వినియోగం కాదు
పదాల ప్రయోగం చేస్తా
వాక్యాల క్రమము కాదు
భావాల శ్రేణి కూర్చుతా
రవి కిరణాలు కాదు
కవి కాంతులు ప్రసరిస్తా
శశి వెన్నెల కాదు
కవన కౌముది కురిపిస్తా
డబ్బుల హరణం కాదు
హృదుల దోపిడి కాంక్షిస్తా
చదువరుల పొగడ్తలు కాదు
విమర్శకుల వ్యాఖ్యలు ఆశిస్తా
పాఠకుల సంతోషం కోసం
పగలు రాత్రులు పాటుబడతా
నిజమైన కవిత్వం కోసం
నిత్యం ప్రయత్నం సాగిస్తా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment