తెలుగు బ్రతకాలంటే...
తెలుగు!
వెలుగులు చిమ్మించాలంటే—
అందరమూ...!
దీపాలు ముట్టించాలి,
జ్యోతులు రగిలించాలి,
అగ్నికణాల్లా మిన్నలుముట్టాలి!
తెలుగు!
తియ్యదనాలు చిందాలంటే—
మనమందరం...!
తేనె చుక్కలై రాలాలి,
నదీప్రవాహమై పారాలి,
ఊరువాడల్లో మోగాలి!
తెలుగు!
విశ్వవ్యాప్తం కావాలంటే—
తెలుగోళ్ళమంతా...!
ఒకే అడుగు వేసి,
ఒకే శ్వాస పీల్చి,
ఒకే జెండా ఎగరేయాలి!
తెలుగు!
పాటలు పాడించాలంటే—
సర్వులమూ...!
గొంతులు కలపాలి,
ఒకే స్వరం వినిపించాలి,
సింహగర్జన చేయాలి!
తెలుగు!
సొగసులు చూపాలంటే—
మనజాతి...!
తేటమాటలు పలకాలి,
వెలుగులు విరజిమ్మాలి,
విశ్వరూపం చూపాలి!
తెలుగు!
వ్రాతలు రాయించాలంటే—
మనమందరం...!
కవులను కాపాడాలి,
సాహిత్యాన్ని గౌరవించాలి,
అక్షరాలసేద్యము చేయాలి!
తెలుగు!
బ్రతికి బట్టకట్టాలంటే—
మన జాతి అంతా...!
ఉద్యమబాట పట్టాలి,
ముందుకు కదలాలి,
చైతన్యం తేవాలి!
తెలుగువారు
ఇప్పుడైనా మేల్కొనాలి,
నడుము బిగించాలి,
కదం త్రొక్కాలి,
సత్వరచర్యలు చేపట్టాలి!
రండి!
కదలిరండి
తెలుగుకంకణం కట్టించుకోండి,
తెలుగుపతాకం చేతపట్టండి,
తెలుగువాణిని వినిపించండి,
తెలుగుతల్లిని గౌరవించండి
తెలుగుజాతికి!
ఇదే సమయం—
లేకపోతే చరిత్ర మాపేసి వేస్తుంది!
అందుకే...! తెలుగు జీవించాలి అంటే—
మనల్ని మనమే బ్రతికించుకోవడమే!!!
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment