కవిత్వం అంటే?


కవిత్వం అంటే కాదురా

భావాల ఉప్పెనా...

అక్షరాల ఆటా ...


కవిత్వం!

ప్రభంజనమై ఉర్రూతలు ఊగిస్తుంది…

అమరమై పుస్తకాలలో జీవిస్తుంది…


కవిత్వం!

అమృతమై అధరాలను తడుపుతుంది,

తీయదనమై తనువుల తృప్తిపరుస్తుంది.


కవిత్వం!

చక్కదనమై సంతోషం కలిగిస్తుంది,

శ్రావ్యగీతమై వీనులకు విందునిస్తుంది.


కవిత్వం!

సూర్యకిరణమై వెలుగులు చిమ్ముతుంది,

పున్నమివెన్నెలై మదులు మురిపిస్తుంది.


కవిత్వం!

వానచినుకులై హృదయాలను తడుపుతుంది,

ఇంద్రచాపమై రంగులను వెదజల్లుతుంది.


కవిత్వం!

కన్యకయై వలపువల విసురుతుంది,

వధువై పీటపై కూర్చుంటుంది.


కవిత్వం!

మధువై ముచ్చటపరుస్తుంది,

పరిమళమై పరవశపరుస్తుంది.


కవిత్వం!

ఆయుధమై దురాచారాలను నిర్మూలిస్తుంది,

ప్రాణమై గుండెలను ఆడిస్తుంది!


అందుకే…కవిత్వం పదాలసమాహారంకాదు,

అది జీవనధ్యానము, హృదయస్పందనము,

మనసులప్రతిచర్యలు మధురానుభూతులు!


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 


Comments

Popular posts from this blog