ఓరి తెలుగోడా!
కనులముందర
తెలుగుతేజం కనబడుతుంటే
చీకటిలో తడబడటమెందుకోయ్
ఓరి తెలుగోడా!
అచ్చతెలుగు పదాలుండ
కవితలలో మెరిసేముత్యాలుండగ
అర్ధంలేని వ్యర్ధవాక్యాలకు మనసుమళ్ళిస్తున్నావెందుకోయ్
ఓరి తెలుగోడా!
ఆవకాయ గోంగూరకూరలుండ
ఆంధ్రుల ఘుమఘుమలుండగ
విదేశపువంటలను ఆరగిస్తున్నావెందుకోయ్
ఓరి తెలుగోడా!
తేనెలొలుకు మాటలుండ
మదినిమురిపించే తేటతెలుగుయుండగ
రసహీనమైన భాషణలలో కరిగిపోతున్నావెందుకోయ్
ఓరి తెలుగోడా!
సుమధురమైనట్టి
తెలుగుబాణీలు పాటాలుండగ
అన్యభాష పాటలెందుకోయ్
ఓరి తెలుగోడా!
సుందరమైన తెలుగుపడుచులుండ
విలువలు వలువలులేని
ఇతరరాష్ట్రదేశాల వధువులెందుకోయ్
ఓరి తెలుగోడా!
అన్నమయ్య త్యాగయ్య కీర్తనలుండ
రాళ్ళనుకరిగించే గానాలుండగ
పరభాషగీతాలలో మునిగిపోతున్నావెందుకోయ్
ఓరోరి తెలుగోడా!
ఆణిముత్యాల్లాంటి
యాబది ఆరు తెనుగువర్ణమాలుండగ
ఇరువదియారు అక్షరాల ఆంగ్లమెందుకోయ్
ఓరి తెలుగోడా!
తెలుగుతల్లి గుండెచప్పుడు
రక్తంలో కొట్టుకుంటుండగ
ఊపిరితీయదనమును మాతృభాషలో వెలువరించవెందుకోయ్
ఓరి తెలుగోడా!
తెలుగును కాపాడరా
తెనుగును గెలిపించరా
గుండెలను గుబాళించరా
ఓరి తెలుగోడా!
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment