నా జీవనపయనంలో…
పచ్చని అరణ్యంలో
పొంకాలను పరికిస్తూ
ఆనందమధురిమలో విహరించాలనుకుంటున్నా
కీకర అరణ్యంలో
ఎటువంటి గోడుగూలేక
నిశ్శబ్దంగా సంచరించాలనుకుంటున్నా
క్రూర అరణ్యంలో
పశుపక్షాదులను
స్నేహితులుగాభావించి ప్రేమతోమెలగాలనుకుంటున్నా
సాంద్ర అరణ్యంలో
చీమలాగ చిన్నచిన్న అడుగులు వేసుకుంటూ
దారినిపట్టి పయనించాలనుకుంటున్నా
దట్టమైన అరణ్యంలో
గాలిలాగా స్వేచ్ఛగా
దూసుకుంటూ ముందుకుసాగాలనుకుంటున్నా
జనారణ్యంలో
అదురూ బెదురూలేకుండా
స్వేచ్ఛావాయువులుపీల్చుకుంటూ సంచరించాలనుకుంటున్నా
అక్షరారణ్యంలో
పదాలను అల్లుకుంటూ, త్రోసుకుంటూ
నా కవనపధాలను విస్తరించాలనుకుంటున్నా
భావారణ్యంలో
బహువర్ణముత్యాల్లా అనుభూతులను ఏరుకొని
విన్నూతనంగా విప్పిచెప్పాలనుకుంటున్నా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment