ఎందుకు చూస్తా ఊరకుండటం?
ఎందుకు కళ్ళల్లో కారంచల్లుతారు
మాటల్లో విషంక్రక్కుతారు
నోర్లకు తాళాలువేస్తారు
చెవుల్లో సీసంపోస్తారు
ఎందుకు హితాలను పెడచెవినపెడతారు
నగుమోములను ఏడిపించుతారు
మాటలతో విద్వేషాలులేపుతారు
చేతలతో ద్వేషాలుపెంచుతారు
ఎందుకు పండంటి కాపురాలనుకూలుస్తారు
ముత్తైదువుల తాళిబొట్లుతెంపుతారు
చేతలకు బేడీలేస్తారు
కాళ్ళకు సంకెళ్ళేస్తారు
ఎందుకు ముందుకేళ్ళేవారిని ఆపుతారు
పరిగెత్తేవాళ్ళను పడదోస్తారు
ముఖాలపై ఉమ్మివేస్తారు
బట్టలపై బురదచల్లుతారు
ఎందుకు అందాలపువ్వులను నలిపేస్తారు
సీతాకోకచిలుకలను చంపేస్తారు
కోయిలలను గొంతువిప్పనియ్యరు
మయూరాలను నాట్యంచేయనివ్వరు
ఎందుకు సమాజానికి సేవలుచేయరు
సంఘవృద్ధికి తోడ్పడరు
మదులను సృజించరు
హృదులను మురిపించరు
ఎందుకు కవులై కలాలుపట్టరు
కవితలురాసి మార్పులుతీసుకురారు
గాయకులై గళమెత్తరు
నటులై మంచిపాత్రలుపోషించరు
అందరంకలసి మాటలను మధురంచేద్దాము
హృదయాల్లో ప్రేమవిత్తనాలు చల్లుదాము
సమాజంలో సేవాస్ఫూర్తిని వెలిగిద్దాము
కళతో కరుణతో కొత్తలోకం సృష్టిద్దాం
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment