ఎదురుచూపులు
సీతాకోకలు
వెదుకుతుంటాయి విరబూసినతాజాపూలకోసం
టక్కున వ్రాలాలని
గ్రక్కున తేనెను త్రాగాలని
పావురాలు
ఎదురుచూస్తుంటాయి జంటపక్షికోసం
ముక్కులు పొడుచుకోవాలని
తనువులు రాసుకోవాలని
మల్లెలు
నిరీక్షిస్తుంటాయి గ్రీష్మంకోసం
మెండుగా పూయాలని
మత్తులో పడదోయాలని
కోకిలలు
కాచుకొనియుంటాయి వసంతంకోసం
మామిచిగురులు తినాలని
మధురంగా గొంతులువిప్పాలని
నేల
నింగివైపు చూస్తుంటుంది చినుకులకోసం
తడిసి ముద్దవ్వాలని
పచ్చనిమొక్కలు కనిపెంచాలని
రాత్రి
చూస్తుంటుంది వెన్నెలకోసం
జాబిలి రావాలని
వెన్నెలను చిమ్మాలని
కడలి
తొందరపడుతుంది కెరటాలకోసం
ఎత్తుగా ఎగిసిపడాలని
తీరాన్ని తాకాలని
మేఘాలు
పొంచియున్నాయి గాలికోసం
నింగినిండా వ్యాపించాలని
అవనినంతా కాంచాలని
మదులు
వీక్షిస్తుంటాయి ఆలోచనలకోసం
తలలకు పనిపెట్టాలని
తనువులు తృప్తిపరచాలని
హృదులు
ప్రతీక్షిస్తుంటాయి ప్రేమకోసం
ఎవరో వస్తారని
ఎదను మమకారంతో నింపుతారని
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment