ఏలనో?
ఒక్కోసారి...
ఉత్సాహం ఉల్లాన ఉప్పొంగుతుంది
పువ్వుల పరిమళంలా…
హరివిల్లు రంగుల్లా!
ఒక్కో సమయాన...
బయటకు పరుగెత్తిపోవాలనిపిస్తుంది
నీలి నింగిని ఆలింగనం చేసుకోవాలని
పిండి వెన్నెలను ఆస్వాదించాలని!
ఒక్కో రోజున...
ప్రకృతిని పరికిస్తే,
కళ్ళు విస్తుపోయి వెలుగుల్లా మెరుస్తాయి
మనసు మురిసిపోయి మల్లెల్లా పరిమళిస్తుంది!
ఒక్కో నిమిషాన...
ఊహలు ఊరుతుంటాయి
నదిలోని ప్రవాహంలా…
కలం నుంచి జాలువారే అక్షరాల్లా!
ఒక్కో క్షణాన...
ఇష్టులను కలిసినట్టనిపిస్తుంది
ప్రాణ స్నేహితుడిని…
పొంకాల ప్రేయసిని!
ఒక్కో మారు...
వేడి తగిలినట్టనిపిస్తుంది
రక్తం ఉడికిపోతూ…
హృదయం కరిగిపోతూ!
ఒక్కో తడవున...
కలం చెయ్యి పట్టుకుంటుంది
"అక్షరాలను పేర్చు!" అంటుంది,
"కవితలను కూర్చు!" అని ఆజ్ఞాపిస్తుంది!
ఒక్కో రీతిన...
కవిత కవ్విస్తూనే ఉంటుంది
తియ్యదనాలు పంచమని…
కమ్మదనాలు కురిపించమని!
కవితలకు
సాదర స్వాగతాలు
కవులకు
అక్షర నీరాజనాలు!
వాణీదేవికి
వేల వందనాలు
సాహిత్య లోకానికి
సుమాంజలులు!
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment