నన్ను తీసేయకు...


ఏదో ఒకరోజున

ఙ్ఞాపకమై వస్తా

పాతక్షణాలు నెమరేయిస్తా

కొత్త ఆశలు రేకెత్తిస్తా


ఏదో ఒకరోజున

కలలోకి వస్తా

కవ్వించుతా

కుతూహలపరుస్తా


ఏదో ఒకరోజున

మేనుతడతా

మేలుకొలుపుతా

మేలుచేస్తా


ఏదో ఒకరోజున

మంచిమాటలు చెబుతా

నమ్మకము కలిగిస్తా

మదిలో నిలిచిపోతా


ఏదో ఒకరోజున

చెంతకు వస్తా

చెలిమి చేస్తా

చేతులు కలుపుతా


ఏదో ఒకరోజున

అవకాశం ఇస్తా

అదృష్టం వరింపజేస్తా

అందలం ఎక్కిస్తా


ఏదో ఒకరోజున

ఆటలు ఆడిస్తా

పాటలు పాడిస్తా

నాట్యము చేయిస్తా


ఏదో ఒకరోజున

చిరునవ్వులు చిందిస్తా

మోమును వెలిగించుతా

హృదిని ఆకట్టుకుంటా


ఏదో ఒకరోజున

పూలు చేతికిస్తా

పరిమళాలు చల్లుతా

ప్రేమను పంచుతా


ఏదో ఒకరోజున

అక్షింతలు వేస్తా

దీవెనలు అందిస్తా

శుభాలు సమకూరుస్తా


నన్ను తీసేయకు

నీళ్ళలో తోయకు

మంటల్లో వేయకు

గాలిలో విసరకు


నన్ను దాచుకో

నన్ను చూచుకో

నన్ను కాచుకో

నన్ను దోచుకో


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 

Comments

Popular posts from this blog