🎵 పూల సంబడాలు


తోటలో పూసిన పూలు –

చూపుతున్నాయి  అందాలు,

తలపై జారిన పూలు –

ఘటిస్తున్నాయి అంజలులు. 🌸


చీరల పైన పూలు –

చిమ్ముతున్నాయి రంగులు,

దారిలో చల్లిన పూలు –

పలుకుతున్నాయి స్వాగతాలు. 🌼


వేదికపై పూలు –

చేస్తున్నాయి వేడుకలు,

కొప్పుల్లో తురిమిన పూలు –

చల్లుతున్నాయి మత్తులు. 🌺


కాగితంపై పూలు –

కట్టేస్తున్నాయి కళ్ళు,

ఊహల్లోని పూలు –

ఊరిస్తున్నాయి ఉల్లాలూ. 🌹


మెడలో వేసిన పూలు –

మురిపిస్తున్నాయి మనసులు,

దేవుడిపాదాలదగ్గరి పూలు –

చేస్తున్నాయి పాదసేవలు. 🌼


విరబూసిన పూలు –

తడుతున్నాయి హృదులు,

విచ్చుకున్న పూలు –

ముడుతున్నాయి మదులు. 🌷


చేతికిచ్చిన పూలు –

చాటుతున్నాయి ప్రేమను,

సిగలో దోపిన పూలు –

సూచిస్తున్నాయి ప్రణయమును. 🌸


పక్కపైని పూలు

పలుకుతున్నాయి సరసాలు

నలిగిపోయిన పూలు

తెలుపుతున్నాయి తన్మయత్వాలు. 🌺


మొగ్గలైనా పూలు –

ఇచ్చేది మురిపమే,

విచ్చుకున్నా పూలు –

విసిరేది వయ్యారమే. 🌹


ఎక్కడున్నా పూలు

అందాలకారకమే 

ఎంతచూచినా పూలు

ఆనందభరితాలే. 🌺


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 

Comments

Popular posts from this blog