కవితా మహిమలు
కవిత్వం
జనిస్తుంది
ధ్వనిస్తుంది
తరిస్తుంది మహిమాన్వితమై
కవిత్వం
కదులుతుంది
కదిలిస్తుంది
కట్టిపడేస్తుంది సంగీతమై
కవిత్వం
కనబడుతుంది
వినబడుతుంది
కుదుపుతుంది రసవాక్యాలై
కవిత్వం
ప్రవహిస్తుంది
పయనిస్తుంది
పరుగెత్తిస్తుంది హృదయమై
కవిత్వం
పూస్తుంది
పరిమళిస్తుంది
పులకరిస్తుంది అంతరంగమై
కవిత్వం
పొడుచుకొస్తుంది
ప్రకాశిస్తుంది
పరిఢవిల్లుతుంది వెలుగై
కవిత్వం
వినమంటుంది
తినమంటుంది
త్రాగమంటుంది మత్తుపదార్ధమై
కవిత్వం
పలుకుతుంది
ఉలుకుతుంది
కులుకుతుంది రాగమృతమై
కవిత్వం
కురుస్తుంది
తడుపుతుంది
కరిగిస్తుంది వర్షధారై
కవిత్వం
నాటుకుంటుంది
మొలకెత్తుతుంది
మానవుతుంది బీజమై
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment