వద్దు...వలదు


ఆలోచనలకు అడ్డుకట్ట వేయవద్దు - 

మనసుకు పగ్గాలు వేయవలదు,

కళ్ళకు గంతలు కట్టుకోవద్దు - 

చెవులను దూదితో నింపుకోవలదు.


సూర్యుడుకు అరచేయ్యడ్డంపెట్టాలనుకోవద్దు - 

చంద్రుడును మబ్బుల్లో దాచాలనుకోవలదు,

గుండెకు గుబులు పుట్టించవద్దు - 

హృదయముకు చిల్లులు పొడవవలదు.


చూపులను పక్కకు మరల్చవద్దు - 

మోమును కనపడకుండా దాచవలదు,

కలాలకు మూతలు పెట్టవద్దు - 

వ్రాతలకు వీడ్కోలు పలుకవలదు.


మౌనమును పాటించవద్దు - 

పెదవులకు తాళాలేయవలదు,

మొక్కలను పీకి పారవేయవద్దు - 

పువ్వులను తెంపి నలిపేయవలదు.


పీకలను నొక్కివేయవద్దు - 

స్వేచ్ఛను హరించవలదు,

సత్యాలను దాచవద్దు - 

పుకార్లను వ్యాపించవలదు.


ఓటర్లను మభ్యపెట్టవద్దు - 

హామీలను ఏమరచవలదు,

ఆయుధాలు చేతపట్టవద్దు - 

అమాయకులను అణచివేయవలదు.


మాటలను మీరవద్దు - 

కోతలను కోయవలదు,

గొప్పలు చెప్పుకోవద్దు - 

గోతులు తీయవలదు.


పనులకు విరామం ఇవ్వవద్దు - 

చేతులకు సంకెళ్ళు వేసుకోవలదు,

పయనాలను విరమించుకోవద్దు - 

కాళ్ళకు బంధాలు వేయవలదు.


కన్నతల్లిని కష్టపెట్టవద్దు - 

మాతృభాషని మరచిపోవలదు,

దేశమును ద్వేషించవద్దు - 

ద్రోహాలకు పాల్పడవలదు.


ప్రేమకు ఎల్లలుపెట్టవద్దు - 

శుభాలకు అడ్డుతగలవలదు,

మానవతే మతమని మరవవద్దు -

జీవితాలే వెలుగని ఆర్పవలదు.


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments

Popular posts from this blog