ఆమె


నా ఊహల్లో ప్రవాహమై,

నా శిరస్సులో వెలుగై,

నా దేహంలో అధిష్టానమై –

ఆమే నా జీవనగీతం.


నా కంటిలోని పొంకమై,

నా నాసికలో పరిమళమై,

నా పెదవుల్లో పీయూషమై –

ఆమే నా సౌందర్యస్వరూపం.


నాకు కోకిల కంఠమై,

నాకు గాంధర్వ గానమై,

నాకు నెమలి నృత్యమై –

ఆమే నా మానసికవినోదం.


నాకు చక్కని నీలాకాశమై,

నాకు చల్లని కడలికెరటమై, 

నాకు తెల్లని సూర్యోదయమై -

ఆమే నా చిక్కని భావతరంగం. 


నా అందాల కుటీరమై, 

నా ఆనంద కుటుంబమై, 

నా శాశ్వత విలాసమై -

ఆమే నా మాటల సమాహారము.


ఆమె నా వంటికి భోగమై, 

ఆమె నా చేతికి భాగ్యమై, 

ఆమె నా నోటికి భోజ్యమై -

ఆమే నా బ్రతుకుకి బలము.


నాకు ఎర్రని మందారమై, 

నాకు తియ్యని మకరందమై, 

నాకు చంచల మానసమై -

ఆమే నా రసాత్మక కావ్యము.


నా ఆలోచనల సరళిగా,

నా భావాల తరంగిణిగా,

నా పదాల ప్రవహాముగా –

ఆమే నా అక్షరాలరూపం.


ఆమె కలము పట్టిస్తుంది,

ఆమె కవనం చేయిస్తుంది,

ఆమె పుటలు నింపిస్తుంది -

ఆమే మదులు దోచేస్తున్నది.


ఆమె వెలుగులు చిమ్ముతుంది,

ఆమె ప్రేమజల్లులు కురిపిస్తుంది ,

ఆమె రాగాలు తీయిస్తుంది –

ఆమే ముందుకు నడిపిస్తుంది.


ఆమె నా జీవిత ధ్యేయము,

ఆమె నా జీవన పయనము,

ఆమె నా నిత్య ప్రేరణము -

ఆమే నా ఉజ్వల భవితవ్యము 


ఆమె నా చపలత్వము

ఆమె నా మనోకల్పితము

ఆమె నా కష్టఫలము

ఆమే నా కవిత్వము


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 

Comments

Popular posts from this blog