చీర – నవరస రాగిణి
వక్షస్థలాన చుట్టుకుంటే,
నడుమున బిగించుకుంటే –
వెన్నెల నవ్వులై మెరిసి,
విరహంలో ముంచుతుంది శృంగారరసమై.
గాలి కొంగుని జార్చితే,
అంచు గజ్జెలో చిక్కితే –
ధారకిని తిప్పుతూ నవ్వించి,
చూపరుల హృదయాలు గిలిగింతలు పెట్టిస్తుంది హాస్యభరితమై.
కన్నీటి బొట్టును తుడిచి,
చీము జారిన ముక్కును శుభ్రపరచి –
బాధను ఒదిగి మౌనంలోకి
మనసుని నడిపిస్తుంది కరుణారసంచల్లుతూ.
కోపం ఉబికి తన్నుకొస్తే,
కొంగు నడుముకు దోపితే –
కళ్లలో నిప్పులు రగిల్చి
పొగరుబోతులకి గుణపాఠం చెబుతుంది రౌద్రరూపియై.
పంటూరి అడుగుల్లో,
పగడపు మెరుపుల్లో –
నిలువెత్తు బంగారంలా మెరిసి
ధైర్య పీఠమై ముందుకునడిపిస్తుంది వీరవనితయై.
చీకటిముసురులో,
కొంగు పట్టుకొని నిలబడి –
ముష్కరులనెదుర్కొనే
సాహసినియై రక్షిస్తుంది భయానకకాళికయై.
పెద్దల సమక్షంలో అవమానిస్తే,
పలువురు అపనిందలేస్తే –
శీలానికి మరకవేసిన వేళ
తలదించుకుంటుంది భీభత్సాన్నిసృష్టిస్తూ.
రంగుల వాన పడితే,
పూలు పలకరింతలు చేస్తే –
చుట్టూ వాతావరణం మైమరచి
చూసినవారిపై మాయాజల్లులు చిందిస్తుంది అద్భుతరూపియై.
తల్లి ఒడిలా ఆదరించి,
జోల పాటలా తేలికపరిచి –
చక్కని సలహాలను ఇచ్చి
ఆవేశాలను చల్లారుస్తుంది శాంతరసంచల్లుతూ.
చీర కేవలం వస్త్రమే కాదు –
నవరసాల జలపాతము.
అభిరుచి – అభిమానాల ప్రతిరూపము.
మహిళామణులకు అందము… ఆనందము.
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments
Post a Comment