🌺 కడుపే కైలాసం


కడుపు పండితే – కొంపలో కులాసం,

కడుపు నిండితే – వంటికి భుక్తాయాసం.

కడుపు చించుకుంటే – కాళ్ళపైబడు అమేధం,

కడుపు కాల్చుకుంటే – శక్తిలేక శరీరనిస్సారం.


కడుపు చల్లబడితే – మనసుకు ప్రశాంతం,

కడుపు బానైతే – అనారోగ్య కారకం.

కడుపు కోరుకుంటే – మన్మథ విలాసం,

కడుపు పోతే – బాధాత్మకం విచారకరం.


కడుపు కోతకుగురైతే – కన్నీటి సాగరం,

కడుపు మండితే – అగ్గిమీద గుగ్గిలం.

కడుపు కొడితే – వెంటాడు కర్మఫలం,

కడుపు కాపాడుకుంటే – జీవనం సంతృప్తికరం.


కడుపు ఆడిస్తే - మేనుకు వ్యాయామము,

కడుపు తిప్పితే - వెలువడు వాంతులు.

కడుపు అరగకపోతే - వసువుకు చేటు,

కడుపు కూలబడితే - గుండెకు ప్రమాదం.


కడుపు కైలాసం – ఇల్లు వైకుంఠం,

కడుపు క్షేమం – దేవతల ప్రసాదం,

కడుపును కాచుకో – దేహం రక్షించుకో,

కడుపును పట్టించుకో – జీవితగమ్యం చేరుకో.


✍️ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog