పలుకుల భాగవతం
ప్రేమ పలుకులు
హృదిని తడతాయి
తీపి పలుకులు
మదిని ముడతాయి
పాత పలుకులు
చికాకు పెడతాయి
కొత్త పలుకులు
హుషారు నింపుతాయి
నవ్వుల పలుకులు
నచ్చుతాయి
నాతుల పలుకులు
మురిపిస్తాయి
మెత్తని పలుకులు
సొంపుగుంటాయి
కాఠిన్య పలుకులు
గుచ్చుకుంటాయి
చెలి పలుకులు
శ్రావ్యంగుంటాయి
మిత్రుని పలుకులు
మృదువుగుంటాయి
శిశువుల పలుకులు
సంతసపరుస్తాయి
శతృవుల పలుకులు
రెచ్చగొడతాయి
చిలిపి పలుకులు
నవ్వులు చిందిస్తాయి
గేలి పలుకులు
పౌరుషము పుట్టిస్తాయి
గుట్టు పలుకులు
రట్టుచేస్తాయి
ద్వేష పలుకులు
మంటలు లేపుతాయి
దొంగ పలుకులు
దోషులుగా నిలుపుతాయి
వంకర పలుకులు
వక్రబుద్ధిని చాటుతాయి
పెద్దల పలుకులు
శాసిస్తాయి
పడచుల పలుకులు
కవ్విస్తాయి
పసిడి పలుకులు
వెలుగుతాయి
మిసిమి పలుకులు
విర్రవీగిస్తాయి
ఉట్టి పలుకులు
విలువలను చెరిపేస్తాయి
సుత్తి పలుకులు
చెవులను మూయించుతాయి
తేట పలుకులు
వినమంటాయి
చిట్టి పలుకులు
వాడమంటాయి
గొప్ప పలుకులు
గుర్తించమంటాయి
చెత్త పలుకులు
త్యజించమంటాయి
మనసు పలుకులు
మంత్రాలవుతాయి
పరులమేలు పలుకులు
పుణ్యాలవుతాయి
నీతి పలుకులు
సూక్తులవుతాయి
సత్య పలుకులు
భాగవతమవుతాయి
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment