కలిసుంటే కలుగు సుఖం


మంచాలు 

విడిపడితే పరవాలేదు

మమతలు

వేరుపడితే బాగుండదు


ప్రాంతాలు

చీలిపోతే నష్టంలేదు

పంతాలు

పెట్టుకుంటే లాభముండదు


డబ్బులు

పంచితే ముప్పులేదు

జబ్బులు

వ్యాపిస్తే శ్రేయంకాదు


వేషాలు

మార్చితే సంస్కృతిపై వేటు

భాషను

మరిస్తే మాతృబాసకి చేటు


ద్వేషాలు

పెంచితే భవిష్యత్తుకు ప్రమాదం

ఉద్రేకాలు

సృష్టిస్తే పతనానికి ప్రారంభం


విడిపోవటాలు

వినాశనానికి మార్గం

కలసిపోవటాలు

సంక్షేమానికి సుగమం


కలసి

ముందుకు సాగు

చేతుల్ని

కలుపు కదులు


స్వార్ధాన్ని

వెంటనే వదులు

ఐక్యమత్యాన్ని

ఆయుధంగా వాడు


ఆలపించు

శ్రావ్య సమైకరాగం

ఆలకించు

సుస్వర సమతాగీతం


అమలుపరచు

ఉమ్మడి సంకల్పాలు

అనుభవించు

విజయ ఫలాలు


అనైక్యతే

చేయును విధ్వంసం

అభివృద్ధే

కావాలి అందరిగమ్యం


కలిసుంటే

కలుగు సర్వులకు సుఖం

తెలుసుకుంటే

అదగు జీవన బోధనం


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 


Comments

Popular posts from this blog