డొంక దొరికితే…
డొంక దొరికితే – పాకుతా సాగుతా,
కిటుకు చిక్కితే – అల్లుతా, కూర్చుతా.
పూలు లభిస్తే – గుచ్చుతా, కట్టుతా,
పగ్గాలు చేతికొస్తే – లాగుతా, తోలుతా.
ఊహలు తడితే – ఊరిస్తా, పారిస్తా.,
విషయము నచ్చితే – వివరిస్తా, వర్ణిస్తా.
అధికారం దక్కితే – శాసిస్తా, చెలాయిస్తా,
దారి కనబడితే – అడుగులేస్తా, అంతంచేరుతా.
పైకి ఎత్తితే – పొంగిపోతా, పొర్లిపోతా,
పొగడ్తలు గుప్పిస్తే – పరవశిస్తా. గుర్తించుకుంటా.
ప్రేమిస్తే – కరిగిపోతా, దొరికిపోతా,
మనసిస్తే – మచ్చికవుతా, మురిపిస్తా.
కలం పడితే – కదిలిస్తా, గీస్తా,
కాగితం కనబడితే– నింపుతా, వెలిగిస్తా.
శ్రోతలుంటే – ఆడుతా, పాడుతా,
పాఠకులుంటే – వ్రాస్తా, చదువుతా.
ప్రోత్సహిస్తే – కరుగుతా, చెలరేగుతా,
సత్కరిస్తే – సంతసిస్తా, సంబరపడతా.
బహుమతులు ఇస్తే - మెచ్చుకుంటా, మెడెత్తుకుంటా,
బిరుదులు ఒసగితే – పుచ్చుకుంటా, పరవశించుతా.
శైలి నచ్చిందా - పదాలసరళి బాగుందా,
అక్షరాలు అమరాయా, పదాలు పొసిగాయా.
పాకం కుదిరిందా - తేనెజల్లు కురిసిందా,
భావం వ్యక్తమైందా - అమృతం అందిందా.
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment