🌿 సమయ సందర్భాలు 🌿


సమయం రాగానే

సందర్భం వచ్చును,

సంకల్పం నెరవేరును —

సద్విభావం జనించును.


సమయం రాగానే

కాయలు పక్వానికి వచ్చును,

రుచిగా శుచిగా ఉండును —

తరువుల గుండెలు నిండును.


సమయం రాగానే

వసంతం వెలుగులు చిమ్మును,

చిగురులు నవ్వులు చిందును —

పూలు పరిమళించును.


సమయం రాగానే

వేకువ వెలసును,

కోళ్లు కూయుచు మేల్కొలుపును —

జగము జాగృతమగును.


సమయం రాగానే

తేటులు మూగును, తేనెను త్రాగును,

వానమబ్బులు కమ్ముకొనగానే

వర్షాలు పడును పుడమి పచ్చబడును.


సమయం రాగానే

ముహూర్తం గంట మోగును,

మాంగల్య ధారణ జరుగును —

పెద్దల ఆశీస్సులు కురియును.


సమయం రాగానే

పంటలు పండును,

కోతలు కోసి నూర్పులు జరుగును —

ధాన్యమై ఇంటికి వచ్చును.


సమయం రాగానే

వయసు వర్ధిల్లును,

వివాహాలు జరుగును —

సంతానం కలుగును.


సమయం – కర్మ కలిసొస్తే

పేరు ప్రతిష్ఠలు దొరుకును,

సుఖశాంతులు ప్రాప్తించును —

సంసారం సాఫీగా సాగును.


సమయానికై కాచుకొనుము,

సద్వినియోగం చేసుకొనుము,

సత్ఫలితములను పొందుము —

సుఖంగా జీవితం గడుపుము.


✍️ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments

Popular posts from this blog