పున్నమి వెన్నెల


పున్నమి వెన్నెల పూసింది ఆకాశం -

తేనె వెల్లువలా పారింది మాధుర్యం.

జాబిలి చిందిన ముత్యాల జలధార -

పుడమి ముఖముపైన జార్చె పసిడిహార.


పొలాలపై మెరిసె వెండి ముసురు -

గాలిలో తియ్యగా తేల్చె తిమిర సౌరభాలు.

నదీ తీరాన యువకుల మదులందు -

కౌముదిలో తేలాడె ప్రేమగాధల ఊహలు.


తోటలోని పూలను తాకిన చంద్రిక -

తేనెలా కరిగి చేరెను మనసుల.

చెరువుల మీద ఆడగా చుక్కలచిలుకలు -

చిమ్మె చందమామ చక్కని చిరునవ్వులు. 


పల్లె బాటలపైన పరచుకొన్న శ్వేతవర్ణము -

మట్టివాసనతో నింపె హృదులందు మమకారము.

పొగమంచునందు పారె పగటికలలు -

ప్రతి కిరణము పాడె మౌనమేళము.


చెట్టు గూళ్ళలో పక్షులు నిద్రించగా -

గుప్పెడు మదులలో మెరిసె జ్వాలలు.

ఆ కైరవిలో తట్టిన ఙ్ఞాపకాలు -

దింపే ప్రణయంలో, లేపే విపరీతకోర్కెలు.


సముద్ర తీరాన కెరటాలు ఆడగా -

ఆకాశంలో చందిరిక నర్తించె మయూరిగా.

నిశ్చబ్ధంలో మెరిసె తట్టెడు తలపులు -

ఆ వెలుగే కవిత్వము ఆ నిశీధే భావము.


నిండు పున్నమి చక్కని చంద్రాతపము -

ప్రకృతి, ప్రీతి తడిమె కవులమదులను.

పాఠకుల హృదులలో ముద్రవేసిన మృదురూపము -

అయ్యె శాశ్వత మాధుర్యపు ఙ్ఞాపకాల సౌధము.


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 


Comments

Popular posts from this blog