అక్షర సత్యాలు 


గుండె కోరేది గాలినికాదు –

బ్రతికించే ప్రాణవాయువును.

మనసు అడిగేది రవికాంతినికాదు –

మనోహర జ్ఞానకిరణాల వెలుగులను.


దేహం ఇమ్మనేది అన్నముకాదు –

ముందుకు నడిపే శక్తి–యుక్తులను.

చెయ్యి కావాలనేది కత్తినికాదు –

రమ్యరాతల పదునైన కలమును.


హస్తము పట్టుకోవాలనేది కర్రనుకాదు –

పుస్తకపు పథదీపమును, కరభూషణమును. 

వంటిని అలరించేది బంగారం కాదు –

ఆకట్టుకునే స్ఫురద్రూప సౌందర్యమును.


చెవులు వినాలనుకునేది సొల్లుకబుర్లు కాదు –

తేనెచుక్కలు లుచిందు పలుకులను.

హృదయం ఎదురుచూసేది మన్మధబాణాలకు కాదు –

సుమసౌరభాల ఆఘ్రహణకు, ఆనందానికి.


శరీరం ఆశించేది మూడుముళ్ళ బంధం కాదు –

మనోరంజితమైన సంబంధం.

మాటలు చెప్పుకోవడం కాలక్షేపానికి కాదు –

సత్సంగానికి, హితాలు నేర్వటానికి.


అక్షరాలు అల్లడం వినోదానికి కాదు –

కవిత్వాన్ని పూయించటానికి.

పదాలు కూర్చడం పనిలేక కాదు –

హృదయాలను పొంగించటానికి.


ఆలోచించడం పనిలేక కాదు –

భావకవనాన్ని సృష్టించటానికి.

జీవించడం నూరేళ్లు గడపటానికి కాదు –

సంఘాన్ని చైతన్యపరచి సుఖపరచటానికి.


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments

Popular posts from this blog