వెళ్తుంటా వెళ్తుంటా...
దూసుకుంటూ వెళ్తా -
దుమ్ముధూళీ లేపుతా,
దోచుకుంటూ వెళ్తా -
మదులను మురిపిస్తా.
కోసుకుంటూ వెళ్తా -
బడాయీలు కూస్తా,
మోసుకుంటూ వెళ్తా -
భారాలు తలకెత్తుకుంటా.
రాచుకుంటూ వెళ్తా -
రాపిడిని కలిగిస్తా,
త్రోసుకుంటూ వెళ్తా -
పరుగురేసులో నెగ్గుతా.
గుచ్చుకుంటూ వెళ్తా -
సుమమాలలు అల్లుతా,
పూచుకుంటూ వెళ్తా -
సౌరభాలు గుప్పిస్తా.
చేసుకుంటూ వెళ్తా -
లక్ష్యాలను సాధిస్తా,
కాచుకుంటూ వెళ్తా -
పేరుప్రఖ్యాతులు పొందుతా.
ఇచ్చుకుంటూ వెళ్తా -
అడుక్కునేవారిని ఆదుకుంటా,
గీసుకుంటూ వెళ్తా -
చిత్రమైనబొమ్మలు సృష్టిస్తా.
తీసుకుంటూ వెళ్తా -
అనుభవాలజేబులు నింపుకుంటా,
చాచుకుంటూ వెళ్తా -
కరచాలనాలు ఇస్తూకదులుతా.
కస్సుమంటూ వెళ్తా -
దుష్టులభరతం పడతా,
బుస్సుమంటూ వెళ్తా -
కఠోరసత్యాలు చిమ్ముతా.
వేచుకుంటూ వెళ్తా -
బిక్షగాళ్ళజోలులు నింపుతా,
నోచుకుంటూ వెళ్తా -
దైవకృపకు పాత్రుడనవుతా.
వెళ్తుంటా వెళ్తుంటా -
పదాలపయనమై వెళ్తుంటా,
రాస్తుంటా రాస్తుంటా -
జీవనగీతాలై రాస్తుంటా.
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment