కవితా భాగ్యము


అన్ని ద్వారాలు — ఒకేసారి తెరుచుకుంటున్నాయి,

అన్ని దారులు — ఒకేచోటకు చేరుస్తామంటున్నాయి.

అన్ని అక్షరాలు — ఒకేలయలో కూరుతున్నాయి,

అన్ని పదాలు — ఒకేభావం పలుకుతున్నాయి.


అన్ని కలాలు — ఒకేశైలిలో రాస్తున్నాయి,

అన్ని గీతాలు — ఒకేకంఠంతో పాడుతున్నాయి.

అన్ని మదులు — ఒకేసారి చదవాలంటున్నాయి,

అన్ని హృదులు — ఒకేతీరున మురిసిపోతున్నాయి.


అన్ని రుచులు — ఒకేపట్టున ఆరగించమంటున్నాయి,

అన్ని రసాలు — ఒకేతడవున ఆస్వాదించమంటున్నాయి.

అన్ని అందాలు — ఒకేమారు దర్శనమిస్తున్నాయి,

అన్ని ఆనందాలు — ఒకేసారి తడుముతున్నాయి.


నా మాటలకు — చప్పట్లవర్షం కురుస్తోంది,

నా చేతలకు — ప్రశంసాపుష్పాలు అందుతున్నాయి.

నా అదృష్టం — పొంగిపొర్లి పరవశిస్తోంది,

నా భాగ్యం — గగనమంతా ఎగసిపోతోంది.


కవితే నా భాగ్యం – కాగితంపై పూసిన పరవశ పుష్పం,

కవితే నా ధ్యేయం – పాఠకుల ఎదల్లో కలిగించే ప్రభంజనం.

కవితే నా ప్రాణం – భావాల విహంగం,

అక్షరాల ఆకాశం, పదాల ప్రపంచం.


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments

Popular posts from this blog