వృద్ధుడను వ్యర్ధుడను
వ్రాలిపోయే వృక్షమును
రాలిపోయే పుష్పమును
ఎండిపోయే కొమ్మను
ఊడిపడే ఆకును
ఆరిపోయే దీపమును
ఆగిపోయే గుండెను
వీడుబోయిన పొలమును
తగలబెట్టిన పంటను
ఆకర్షణలేని రూపమును
ఆకట్టుకోలేని అక్షరమును
పుచ్చిపోయిన విత్తనమును
చెడిపోయిన ఫలమును
పదునులేని ఖడ్గమును
సిరాలేని కలమును
వయసుమీరిన వృద్ధుడను
శక్తిలేని అసమర్ధుడను
అస్తమిస్తున్న సూరీడును
కదలలేకున్న కలమును
రాహుమ్రింగుతున్న చంద్రుడను
కూలుపోబోతున్న నక్షత్రమును
జుట్టులేని శిరమును
ఊహలుడిగిన మనసును
చూపుమందగించిన అంధుడను
వినికిడితగ్గిన బధిరుడను
కరిగిపోయే కాలమును
ఎగిరిపోయే దూదిపింజను
కాల్చబోయే కాయమును
గోడకేలాడబోయే చిత్రమును
రాయాలనుకున్న కవితలుకూర్చలేనివాడను
పాడాలనుకున్నా గళమునెత్తలేనివాడను
సాహితీసేవను సాగించలేనివాడను
కవితాజల్లులును కురిపించలేనివాడను
డబ్బులు లేనివాడను
జబ్బులు ఉన్నవాడను
ఇంటికి బరువును
భూమికి భారమును
ఏమయినా అక్షరాల్లో
ఇంకా మండుతుంటా వెలుగుతుంటా
మదుల్లో మెదులుతుంటా
జనాల్లో జీవిస్తుంటా
-- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment