సాహితీప్రపంచం
సాహితీజగతి
స్వాగతిస్తున్నాది
అందాలప్రకృతి
అలరించుచున్నాది
అక్షరవిత్తనాలు
నాటమంటున్నాయి
పచ్చనీమొక్కలు
పొడుచుకొస్తామంటున్నాయి
ఆలోచనాధారలు
ఊరుతామంటున్నాయి
భావాలజ్వాలలు
పారుతామంటున్నాయి
పదాలపుష్పాలు
పూస్తామంటున్నాయి
సుమాలసౌరభాలు
చల్లుతామంటున్నాయి
తేనెపలుకులు
విసరమంటున్నాయి
సీతాకోకచిలుకలు
ఎగురుతామంటున్నాయి
కవనమేఘాలు
తేలుతామంటున్నాయి
అమృతజల్లులు
కురుస్తామంటున్నాయి
ప్రాసల ప్రవాహాలు
ప్రయోగించమంటున్నాయి
పాఠకుల హృదయాలు
స్పర్శించమంటున్నాయి
నవ్వుల చరణాలు
నాట్యం చేస్తామంటున్నాయి
మోముల వెలుగులు
ముసురుతామంటున్నాయి
కవితా కెరటాలు
ఎగిసిపడతామంటున్నాయి
చక్కనీ జాబిలి
వెన్నెల వెదజల్లుతానంటున్నాది
సాహితీసేద్యము
చేయమంటున్నాది
సాహిత్యయాత్రను
సాగించమంటున్నాది
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment