స్పందనలపర్వం


చేయిచాచితే

చెంతకుచేరి చేతులుకలుపుతా

వేలుచూపితే

వెన్నుచూపి దూరంగావెళ్లిపోతా


మెత్తగుంటే

మెల్లగా పిసికిపెడతా

గట్టిగుంటే

విరగకొట్టి పిండిచేస్తా


తీపిగుంటే

గుటుక్కున త్రాగుతా

చేదుగుంటే

చటుక్కున క్రక్కుతా


మాట్లాడితే

మూతితెరచి ముచ్చటిస్తా

కొట్లాడితే

కఠినంగా తిరగబడతా


తిన్నగుంటే

మిన్నగా ఉండిపోతా

వంకరుంటే

చక్కగా తీర్చిదిద్దుతా


ఎత్తుగుంటే

కత్తినిపట్టి కోసేస్తా

పొట్టిగుంటే

పట్టుకొని సాగదీస్తా


మంచిగుంటే

మదులను మురిపిస్తా

మొండికేస్తే

మందలించి మూలపెడతా


నవ్వుతుంటే

తిరిగి స్పందిస్తా

ఏడుస్తుంటే

జాలిపడి ఓదారుస్తా


ముందుకొస్తే

బెట్టుచేయక జతకడతా

ఎదురుతిరిగితే

నెమ్మదిగా దారికితెచ్చుకుంటా


బ్రతిమాలితే

బిగిసిపడక ఒప్పుకుంటా

స్తుతిమించితే

శీఘ్రంగా తప్పుకుంటా


మురిపించటమే

నా మార్గం

మెప్పించటమే

నా ధ్యేయం


మానవత్వమే

నా మూలం

మదులుముట్టటమే

నా సూత్రం


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం  

Comments

Popular posts from this blog