సందేశాల సంపూర్ణం 


అక్షరసందేశం

కలమునుంచి జాలువారిన

నిశ్శబ్దపు నదిలా

పుటలపై పారుతూ

కాలపు గడపలు దాటి

మనసుల తలుపులు తడుతుంది


శబ్దసందేశం

గళం గగనాన్ని తాకి

తరంగాలలో తేలుతూ

విన్న హృదయాలలో

వణుకుల్ని పుట్టించి

భావాలకు రెక్కలు తొడుగుతుంది


మేఘసందేశం

ఆకాశపు అంచుల నుంచి

చినుకులై జారుతూ

ఎండిన ఆశలను

మాటలులేకుండానే

తడిపి మేల్కొలుపుతుంది


హృదయసందేశం

పలుకుల అవసరం లేని

నాడుల మధ్య ప్రయాణం

చూపులలో మెరుపై

స్పర్శలో స్పందనై

నిజాన్ని తెలియజేస్తుంది


ప్రేమసందేశం

కాలం చెరిగించలేని

కళ్యాణాక్షరంలా

గుండెను తట్టి 

మనసును ముట్టి 

హృదయకాంక్షను తెలుపుతుంది 


మౌనసందేశం

ఏ అక్షరమూ లేని

అత్యంత లోతైన కవిత

అర్థమయ్యేవారికే

అనుభూతిగా మారే

ఆత్మభాషను వెలిబుచ్చుతుంది 


కవితాసందేశం

జీవితపు గాయాలపై

పూసిన అక్షర మల్లెపువ్వై 

చీకట్లోనూ దీపమై

నిజాలను నెమ్మదిగా

హృదయాలకు చేరవేసే

అనంతమైన భావమవుతుంది 


ఇవన్నీ

వేర్వేరు మార్గాలైనా

గమ్యం ఒక్కటే—

మనిషిని

మనిషిగా నిలబెట్టే

సత్యసందేశం మదుల్లో నిలిచిపోతుంది 


ఇన్ని సందేశాలు నేను రాసినవని

మీరు వింటున్నారేమో…

కానీ వాటిలో నన్ను నేను

వినిపించుకున్నాను

అక్షరాల మధ్య నా శ్వాస నడిచింది

భావాల మధ్యనా జీవితం మెదిలింది


కవితను పలికాను గానీ

కవితనే నన్ను నిలదీసింది

ఇక్కడితో నా మాటలు ఆగవచ్చు…

కానీ మీ మదిలో 

ఈ మౌనం కొనసాగితే అదే

కవిసాధించిన సంపూర్ణసందేశమవుతుంది 


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 


Comments

Popular posts from this blog